ఎన్నికల సవిూక్షకు అధికారుల గైర్హాజర్‌

8మందికి షోకాజు నోటీసులు
కరీంనగర్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో ఎన్నికల నిర్వహణకు 22న నోటిఫికేషన్‌ విడుదల కాగా మే 6న ఎన్నికలు జరగునున్నాయి.  జిల్లాలో మొదటి విడత పోలింగ్‌ మే 6న, రెండో దశ 10న జరుగుతుందన్నారు.పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల సమావేశానికి గైర్హాజరైన 8 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఏడుగురు రిటర్నింగ్‌ అధికారులు, ఒకరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌
అధికారి ఉన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ ఆహ్మద్‌ ఆదేశించారు. నామినేషన్లు సంబంధిత మండల కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల నుంచి 5 గంటల వరకు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయాలకు వచ్చిన అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే తీసుకోవాలని సూచించారు. నామపత్రాల దాఖలు పక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులకు హ్యాండ్‌బుక్‌లు ఇచ్చామని, అందులోని అంశాలను క్షుణ్నంగా చదివి సూచించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు.ఏదైనా కారణం చేత నామినేషన్లు తిరస్కరణకు గురైతే అందుకు సంబంధించిన కారణాలను పేర్కొంటూ తిరస్కరించాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే గుర్తింపు పొందిన పార్టీల, రిజిస్టర్‌ పార్టీల అభ్యర్థుల నామినేషన్‌ వివరాలను అక్షరమాల క్రమంలో తయారు చేసుకొని, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది జాబితా ప్రకటించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా గుర్తులతో సహా ప్రకటించాలన్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒకే గుర్తు కావాలని కోరితే వారి సమక్షంలోనే డ్రా పద్ధతిలో గుర్తు కేటాయించాలన్నారు. పోలింగ్‌ రోజున రిటర్నింగ్‌ అధికారులు సంబంధిత మండల పరిధిలో ఉండి పర్యవేక్షించాలన్నారు.  నామినేషన్లు స్వీకరించే కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండలాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక ప్లయింగ్‌ స్కాడ్‌ టీం ఏర్పాటు చేశామన్నారు.