ఎపిని నమ్మించి మోసం చేసిన బిజెపి

కేంద్రసంస్థలను భ్రష్టు పట్టించారు

పోలవరం ప్రాజెక్ట్‌కు సహకరించడం లేదు

అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తున్నాం

విశాఖలో చంద్రబాబు నాయుడు

విశాఖపట్టణం,నవంబర్‌15(జ‌నంసాక్షి): బీజేపీ నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు మండిపడ్డారు. సీబీఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని, సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల తీవ్ర సమస్యలు వచ్చాయని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశాన్ని కాపాడుకోవాలనే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తాం.. విభజన హావిూలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని, ప్రజలంతా మెచ్చేలా అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. హేతుబద్ధత లేకుండా విభజించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికష్టాలు ఉన్నా ప్రజలు బాధలు పడకుండా తాను కష్టపడుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి విశాఖ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు ఇస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదని, మే నెలనాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. చోడవరంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1కు శంకుస్థాపన చేశారు. రూ. 2,200 కోట్ల వ్యయంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్‌-1 నిర్మించామన్నారు. వీలైనంత త్వరగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్‌-1 ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 9 మండలాల్లో లక్షా 30వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. జమ్మాదుల ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తాం. నదుల అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నాం. పేదలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో 51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తున్నాం అని వివరించారు. కరెంట్‌ చార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మాదే. పేదలకు 100 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదల సొంతింటి కల నేరవేరుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.