ఎపిలో అసమర్థ నేత సిఎంగా ఉండాలన్నదే కెసిఆర్‌ కోరిక

అందుకే జగన్‌తో జతకట్టి రాజకీయాలు చేస్తున్నారు

మోదీ, కేసీఆర్‌తో జగన్‌ రాజీపడ్డారు

– జగన్‌ డబ్బులున్న వాళ్లకు టికెట్లు ఇస్తారు

దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను.. కాపాడుకొనేందుకే ఉమ్మడి అజెండా

రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు అనుగుణంగా పొత్తులు

కాపులకు 5శాతం రిజర్వేషన్‌లపై వైసీపీ, బీజేపీలు తమవైఖరిని తెలపాలి

టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి,జనవరి24(జ‌నంసాక్షి): ఏపీలో అసమర్థనేత అధికారంలో ఉండాలని తెలంగాణ సిఎంకేసీఆర్‌ కోరుకుంటున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎపి రాజకీయాల్లో వేలు పెట్టాలనుకుంటున్న లక్ష్యం అదేనని అన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే తన చేతకానితనం తెలంగాణలో ఎక్కడ బయటపడుతుందో అని కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. ‘త్వరలో జగన్‌ గృహప్రవేశం చేస్తారంట.. దానికి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా వస్తారంట అంటూ విమర్శించారు. జగన్‌ కేసుల మాఫీ కోసం మోదీతో, డబ్బుల కోసం కేసీఆర్‌తో రాజీపడ్డారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏపీని జగన్‌ టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెడుతున్నారని, జగన్‌ డబ్బుమనిషని అన్నారు. కేవలం డబ్బున్నవాళ్లకే టికెట్‌ ఇస్తాడంటూ చంద్రబాబు ఆరోపించారు. ఆయన మోసాల్లో ఘనుడని, అందుకే 16నెలలు జైలుకు వెళ్లాడని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, వైసీపీ విమర్శలు చేస్తున్నాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా ఉండకూదనీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వీరు కోరుకుంటున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకొనేందుకే ఉమ్మడి అజెండాతో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ముందుకు సాగుతున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘సేవ్‌ నేషన్‌-సేవ్‌ డెమొక్రసీ-యునైటెడ్‌ ఇండియా’ పేరుతో ఒకే వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో గురువారం నిర్వహించిన ‘ఎలక్షన్‌ మిషన్‌ 2019’ టెలీకాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాల పరిధిలో ఆయా పార్టీల నిర్ణయాల మేరకు ఎన్నికలు వెళ్తున్నారన్నారు. ఏపీలో తెదేపాతో పొత్తు ఉండదని కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ బుధవారం స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌తో పొత్తు లేదన్న సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రాలలో స్థానిక పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ ఉంటుందని.. జాతీయస్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. పశ్చిమ్‌ బంగలో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పొత్తు లేదని.. అయినా కాంగ్రెస్‌ నేతలు కోల్‌కతా ర్యాలీకి వచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. నిరంకుశ పాలన అంతమే కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌గా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. దేశంలోని వ్యవస్థలను కాపాడుకోవడమే ఉమ్మడి అజెండా అని స్పష్టంచేశారు. సేవ్‌ నేషన్‌, సేవ్‌ డెమోక్రసీ, యునైటెడ్‌ ఇండియా పేరుతో బెంగళూరు, కోల్‌కతాలో ఒకే వేదికపైకి వచ్చామన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే 23 భాజపాయేతర పార్టీల అజెండా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భద్రతే తమ ఉమ్మడి లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ మంచిని కోరే ప్రతీఒక్కరూ టీడీపీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజల కోసం పనిచేస్తే.. వైసీపీ, బీజేపీ స్వార్థంతో

పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. నేరాలు-ఘోరాలు, కుట్రలు-కుతంత్రాలు పన్నడమే వారి విధి అని వ్యాఖ్యానించారు.