ఎపి ఎన్నికల ప్రచారంలో పెన్షన్‌ పాలిటిక్స్‌

పోటీపడి పెన్షన్లు పెంచుతామంటున్న నేతలు
కెసిఆర్‌ ఆదర్శంగా పోటాపోటీ హావిూలు
అమరావతి,మార్చి26(జ‌నంసాక్షి): ఎపి ఎన్నికల ప్రచారంలో  పింఛన్ల పాలిటిక్స్‌ జోరందుకుంటోంది. మొదట రూ.200 ఉన్న పింఛన్‌ వెయ్యి రూపాయలకు పెరిగింది. వెయ్యి రూపాయల నుండి రూ.2 వేలకు పెరిగింది. ఇప్పుడు రూ.2 వేలు నుండి రూ.3 వేలకు పెరుగుతోంది. ఇలా.. అధికార ప్రతిపక్షాల మధ్య పింఛన్ల పాలిటిక్స్‌ ఊపందుకుంటోంది. తెలంగాణలో ఇప్పటికే పింఛన్ల మొత్తం రూ.3,016 చేరుకుంది. నువ్వు ఒకటిస్తే.. నేను రెండిస్తా.. అన్నట్లుగా నేతల మధ్య పింఛన్ల పాలిటిక్స్‌ కొనసాగుతోంది. టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తే.. రూ.2 వేల పింఛన్‌ను రూ.3 వేలు చేస్తానని చంద్రబాబు హావిూ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్‌ వయస్సు తగ్గిస్తామని చెప్పారు. వైసిపి కి ఓటు వేస్తే పింఛన్లు ఆగిపోతాయని చంద్రబాబు తెలిపారు. మరో వైపు.. వైసిపి అధినేత జగన్‌.. నవరత్నాల్లో భాగంగా వృద్ధులకు రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేలు పింఛన్లను ప్రకటించారు. పింఛన్ల వయస్సును 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు. చంద్రబాబు పింఛన్‌ను రూ.2 వేలకు పెంచడంతో తాము అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.3 వేలు చేస్తామని హావిూ ఇచ్చారు. తాము పింఛన్లు రూ.2 వేలు పెంచుతామని హావిూ ఇచ్చిన తర్వాతే చంద్రబాబు పింఛన్‌ను రూ.2 వేలకు పెంచారని వైసిపి ఆరోపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. కెసిఆర్‌ సర్కార్‌ వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తామని హావిూ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.3 వేలు చేస్తామని కాంగ్రెస్‌ హావిూ ఇచ్చింది. దీంతో టిఆర్‌ఎస్‌.. అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.3,016 చేస్తామని హావిూ ఇచ్చింది. తెలంగాణలో పింఛన్‌ ప్రస్తుతం రూ.3,016 చేరుకుంది. ప్రస్తుతం ఎపిలో 68 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. చాలా కాలంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు ప్రస్తుతం పింఛన్ల పెరుగుదలతో కొంత మెరుగయ్యారు. పింఛన్ల మొత్తం పెంచుతున్నప్పటికీ.. కొంత మంది అర్హులకు అవి అందడం లేదని ఆరోపణలున్నాయి. అర్హులు ఉన్నప్పటికీ అధికారులు చెప్పినవారికే పింఛన్లు ఇస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.