ఎమ్మెల్యేగా గుర్తించినందుకు థాంక్స్‌

సిఎం కెసిఆర్‌ లేఖపై కోమటిరెడ్డి స్పందన
హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): నల్గొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాసిన లేఖను కోమటిరెడ్డికి సీఎం పంపించారు. విూకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విూరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అని లేఖలో పేర్కొన్నారు. అయితే అందులో ఎమ్మెల్యే అని ఉంది. ఈ లేఖపై స్పందించిన కోమటిరెడ్డి వెంటకట్‌రెడ్డి తనకు శభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఈ  సందర్భంగా కోమటిరెడ్డి పలు అంశాలను లేవనెత్తారు. తనను ఎమ్యెల్యేగా గుర్తించిన సీఎం.. మరి మిగితా ప్రోటోకాల్‌ అంశాలను ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. భద్రత, ఇతర సౌకార్యాలు కల్పించడంలో సీఎం ఎందుకు పట్టించుకోలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నలు కురిపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌పై దాడి చేశారంటూ కోమటరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేయగా కాంగ్రెస్‌ నేతలకు అనుకూలంగా తీర్పు వెలువడింది. వారి శాశసభ సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిని కోమటిరెడ్డితో పాటు నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆయన ఇంటి వద్ద కోలాహలంగా ఉంది. పలువురు నేతలు కార్యకర్తలు ఆయనకు జన్మదిన భాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో తనతో పాటు ప్రతి ఎమ్మెల్యే సీఎం అభ్యర్థే అని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకే దిక్కులేదని అన్నారు. ఇప్పుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్‌రెడ్డికి అంత తొందర ఎందుకని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సెంట్రల్‌ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని, పార్టీ తరపున వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతి లేదని అన్నారు. పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని కోమటిరెడ్డి పిలుపుఇచ్చారు.
————–