ఎయిమ్స్‌ రాకతో మారనున్న తెలంగాణ వైద్యరంగం

బీబీ నగర్‌ నిమ్స్‌ లేదా మరో చోట ఏర్పాటుకు కార్యాచరణ
సిఎంతో చర్చించిన తరవాతనే తుది నిర్ణయం
హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆలస్యంగా అయినా తెలంగాణకు న్యాయం  జరిగిందని భావించాలి. సుదీర్ఘ పోరాటంతో ఎయిమ్స్‌ను మంజూరు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు ఊరట నిచ్చేదిగా ఉంది. దీంతో ఎయిమ్స్‌ను గతంలో ప్రస్తుత బీబీనగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు, మార్పులు చేశారు. కేంద్రం అనుమతి నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ అధికారులు, మంత్రులతో చర్చించి నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే ఎయిమ్స్‌ ఏర్పాటుతో తెలంగాణ రూపురేఖలు మారి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పడనుంది. కేంద్రం నుంచి లేఖ అందడంతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు గతంలో రాష్ట్రం నుంచి పంపించిన ప్రతిపాదనల నమూనాలను సమూలంగా పరిశీలించారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌ కోసం బీబీనగర్‌ వద్ద నిమ్స్‌ భవనాన్ని, అందుకనుగుణంగా స్థలాన్ని ఎంపికచేసినట్లు మూడేళ్ల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  సుమారు రూ.120 కోట్లతో నిర్మించిన బీబీనగర్‌ నిమ్స్‌ భవనాన్ని  ఎయిమ్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. అయితే తాజాగా కేంద్రం నుంచి ఎయిమ్స్‌కు అనుమతి లభించడంతో.. తిరిగి బీబీనగర్‌ వద్దే ఎయిమ్స్‌కు ఏర్పాటు చేయాలా? అనే విషయంపై అధికారులు చర్చించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయి ఉండడం.. అధునాతన వసతులతో భవనం నిర్మితమై ఉన్న నేపథ్యంలో ఎయిమ్స్‌కు ఇదే సరైన ప్రదేశమనీ, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి
తీసుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. ఎయిమ్స్‌ నిర్మాణానికి కొన్ని కచ్చితమైన భవన నిర్మాణ నమూనాలను కేంద్రం అనుసరిస్తోంది. ఇలాంటప్పుడు ఇప్పటికే నిర్మించిన బీబీనగర్‌ నిమ్స్‌ భవనాన్ని కేంద్రం అంగీకరిస్తుందా? అనేది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ కేంద్రం బీబీనగర్‌ నిమ్స్‌ను ఒప్పుకోకపోతే.. హైదరాబాద్‌ పరిసరాల్లోనే మరోచోట స్థల సేకరణను వేగంగా జరపాలని కూడా యోచిస్తున్నారు. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రి స్థాపనకు సుమారు 200 ఎకరాల స్థలంతోపాటు విద్యుత్తు, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంటుంది. ఆసుపత్రి నిర్మాణానికి, నిర్వహణకయ్యే సుమారు రూ.820 కోట్ల వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. ఏటా సుమారు రూ.300-350 కోట్ల నిర్వహణ నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది. సూపర్‌స్పెషాలిటీ నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది.
తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం అధికారికంగా లేఖ పంపించింది. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద 2018-19 సంవత్సరానికిగాను రూ.3825 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన నేపథ్యంలో.. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రికి అనుమతిస్తున్నట్లుగా లేఖలో స్పష్టంగా పేర్కొంది. అవసరమైన స్థల సేకరణపై సత్వరమే దృష్టిపెట్టాలనీ.. ఆసుపత్రికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీపీఆర్‌ రూపకల్పనకు ఉత్తమ ప్రమాణాలు పాటించే సంస్థను ఎంపిక చేసుకోవాలని లేఖలో సూచించింది. సాధ్యమైనంత త్వరగా సమగ్ర ప్రతిపాదనలతో వివరాలను పంపించాల్సిందిగా కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ, ఎంపీల పట్టుదల కారణంగా తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరైంది. వ్యక్తిగతంగా నేను పలు దఫాలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఇదో కీలక పురోగతి. ఎయిమ్స్‌ ఏర్పాటు వల్ల తెలంగాణలో మెరుగైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. సుమారు వెయ్యి పడకల ఆసుపత్రి, దానికి అనుబంధ వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల వస్తాయి.  రాష్ట్రప్రభుత్వం చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌  ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీల కృషికి ఫలితం దక్కింది. రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటు కు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. ఎయిమ్స్‌ ఏర్పాటుకు అవసరమైన రూ.3400 కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థికశాఖ.. భూసేకరణ పక్రియ, మౌలిక సదుపాయాల కల్పనకోసం (సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం, న్యాక్‌) సంస్థలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం లో ఇచ్చిన హావిూ మేరకు తెలంగాణకు ఎయిమ్స్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేండ్లక్రితమే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించినా.. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన విషయాల్లో అనుమతులపై కేంద్ర ఆర్థికశాఖ జాప్యంచేసింది. దీంతో ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు.  దానికితోడు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్‌, బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పార్లమెంటు వేదికగా తెలంగాణకు ఎయిమ్స్‌కోసం పోరాటంచేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలోనే ఏర్పాటు పక్రియ ప్రారంభం కానుంది. బీబీనగర్లో ఎయిమ్స్‌ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. ప్రస్తుతం రాజధానిలో నాలుగైదుచోట్ల స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ మెడికల్‌
కళాశాల పని ప్రారంభించగా.. సిద్దిపేటకు మెడికల్‌ కళాశాల అనుమతి లభించింది.  సీఎం కేసీఆర్‌ హావిూల మేరకు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు కసరత్తు  సాగుతున్నది.