ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తాం


– కాళేశ్వరంతో జిల్లాలో 18వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
– విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ కవిత
నిజామాబాద్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : ఆర్మూర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెరాస ఎంపీ కవిత అన్నారు. మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంకాపూర్‌ రైతులను గురించి సీఎం కేసీఆర్‌ గొప్పగా చెబుతారని కవిత అన్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలో రైతులు ఎర్రజొన్న పండిస్తారని, మద్దతు ధర కోసం రైతులు నిరాహార దీక్ష చేస్తే..స్వయంగా కేసీఆర్‌ ఆర్మూర్‌కు వచ్చారన్నారు. ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్‌ హావిూనిచ్చారని ఎంపీ కవిత చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో 18076 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని కవిత
అన్నారు. మునిపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు రూ.27 వేల కోట్లు మంజూరు చేసుకున్నామని, ఆర్మూర్‌ పట్టణ స్కీంను ఆనాడు సీఎం కేసీఆర్‌ ప్రారంభించారన్నారు. ఆర్మూర్‌లో మిషన్‌ భగీరథ పథకం ప్రారంభించామని, ఆర్మూర్‌లో మంచినీటి సమస్యను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేశామని, అధికారంలోకి వస్తే మళ్లీ లక్ష రుణమాఫీ చేస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.