ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

మంచిర్యాల, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : గత వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేట సవిూపంలోని ఎల్లంపల్లి జలాశయంలోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. శుక్రవారం వరకు జలాశయంలో 19.036 టీఎంసీల వరద నీరు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.036 టీఎంసీల నీరు చేరింది. జలాశయం ఎత్తు 148 విూటర్లు కాగా ప్రస్తుతం 147.59 విూటర్లు నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి ఎగువప్రాంతంలోని వాగులు, కడెం జలాశయం నుంచి 3,24,620 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరుతుండగా 33 గేట్లను 2 విూటర్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి 3,40,428 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో భారీగా వర్షం కురవడంతో వాగులు పొంగి గోదావరిలో వరద ప్రవాహం పెరిగినందున దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.