ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌

– ఇద్దరు మాజీ సీఎంలకు పద్మభూషణ్‌

– కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’

– ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ

న్యూఢిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఈ ఏడాది 10 మందికి పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించగా.. దీంట్లో ఇటీవల మరణించిన ముగ్గురు రాజకీయ ప్రముఖులను ఎంపికచేసింది. వీరిలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్‌ పటేల్‌, అసోం మాజీ సీఎం తరుణ్‌ గగోయ్‌, బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుతం రాజకీయ రంగంలో సేవలందిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, హరియాణాకు చెందిన తర్లోచన్‌ సింగ్‌కు పద్మభూషణ్‌ ప్రకటించారు. కేరళకు చెందిన కృష్ణన్‌ నాయర్‌ శాంతకుమారి చిత్ర (ఆర్ట్‌), కర్ణాటకు చెందిన చంద్రశేఖర్‌ కంబారా (సాహిహత్యం, విద్య), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నృపేంద్ర మిశ్రా (సివిల్‌ సర్వీస్‌), యూపీకి చెందిన కాల్బే సాధిక్‌ (ఆధ్యాత్మికం), మహారాష్ట్రకు చెందిన రజనీకాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌ (ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ)కు పద్మభూషణ్‌ పురస్కారాలను ప్రకటించారు.

ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ

ఈ ఏడాది క్రీడా రంగానికి చెందిన ఏడుగురిని పద్మశ్రీ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో వీరేందర్‌సింగ్‌ (హరియాణా)తో పాటు పి.అనిత (తమిళనాడు), మౌమదాస్‌ (బెంగాల్‌), అన్షు జమ్సెన్పా (అరుణాచల్‌ప్రదేశ్‌), మాధవన్‌ నంబియార్‌ (కేరళ), సుధా హరినారాయణ్‌ సింగ్‌ (యూపీ), కేవై వెంకటేశ్‌ (కర్ణాటక) ఉన్నారు.

కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’

దిల్లీ: కర్నల్‌ సంతోష్‌బాబుకు కేంద్రం మహా వీరచక్ర పురస్కారం ప్రకటించింది. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి ఆయన వీరమరణం పొందారు. సంతోష్‌బాబు సేవలను స్మరిస్తూ మరణానంతరం మహావీరచక్ర పురస్కారాన్ని ఆయనకు కేంద్రం ప్రకటించింది. సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు.. 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలో గల్వాన్‌ లోయ వద్ద చైనా సైన్యం దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. జూన్‌ 15న జరిగిన ఈ ఘటనలో సంతోష్‌బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు.