ఏకగ్రీవాల్లోనూ మహిళలే అధికం

ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన అతివలు

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందించనున్న రూ.10లక్షల ప్రోత్సాహంతో పాటు ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి అదనంగా అందే రూ.15లక్షల నిధుల కోసం పలు గ్రామాల్లో ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో మహిళా సర్పంచ్‌లే అధికంగా ఉండడం విశేషం. మూడు విడతల పక్రియ ముగింపు పూర్తయ్యే సరికి ఏకగ్రీవమైన వాటిల్లో 67 చోట్ల పురుషులు 59 చోట్ల మహిళలు సర్పంచి పీఠాన్ని దక్కించుకున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో మొదటి విడతలో 31 గ్రామాలకుగానూ 12 చోట్ల మహిళలే సత్తా చాటగా.. రెండోవిడతలో 52 ప్లలెలకుగానూ 30 చోట్ల వీరికి అవకాశం దక్కడంతో ముందంజలో తామనే తీరుని ఎన్నికై చూపించారు. మూడో విడతలోనూ 43 పంచాయతీల్లో 17చోట్ల వీరి ప్రాతినిధ్యం కనిపించింది. మొత్తంగా కరీంనగర్‌ జిల్లాలో 9మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 24 మంది, పెద్దపల్లి జిల్లాలో 8మంది, జగిత్యాల జిల్లాలో 18 మంది గ్రామ ప్రథమపౌరురాలిగా ఎన్నికవడం విశేషం. నాలుగు జిల్లాల పరిధిలో మహిళలకు 610 పంచాయతీలు రిజర్వేషన్‌లో భాగంగా కేటాయించగా.. ఇందులో 59 పంచాయతీలు ఏకగీవ్రమయ్యాయిసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఏకగ్రీవాల విషయంలో మార్పు కనిపించింది. పోటాపోటీగా ఈ రెండు జిల్లాల పరిధిలో వీటి సంఖ్య పెరిగింది. మూడు విడతల్లో జగిత్యాల జిల్లాలో 42 స్థానాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43 గ్రామాలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఇదే తరహాలో కరీంనగర్‌ జిల్లాలో 22, పెద్దపల్లి జిల్లాల్లోనూ 19 గ్రామాలతో ఆదర్శనీయమనేలా అడుగులు

పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పాటవడం, పాలనాపరంగా కొత్త మార్పులు రావడంతో గతానికి భిన్నంగా ఈ సారి పంచాయతీ ఎన్నికల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ముచ్చటగా మూడు విడతల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏకగ్రీవాల పంట పండింది. మొత్తంగా 126 పంచాయతీలు ప్రభుత్వం అందించే నజరానాను అందుకునేందుకు ఏకగ్రీవ బాట పట్టాయి. గ్రామస్థులంతా సమష్టి నిర్ణయంతో ఒకరినే సర్పంచిగా ఎన్నుకున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో పాత జిల్లా పరిధిలో మొత్తంగా 58 ప్లలెలు మాత్రమే ఒకేమాటపై నిలబడి ఐక్యతారాగాన్ని వినిపించగా.. ఈసారి ఎన్నికల్లో గత రికార్డును తిరగరాసారు. చాలాచోట్ల కొత్త పంచాయతీలు తొలిపాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1210 పంచాయతీల్లో 10.41శాతం ఏకగ్రీవమయ్యానే పేరు ఉమ్మడి జిల్లా సొంతమైంది. గతంలో ఐదు శాతాన్ని మించని తీరు ఈ ఎన్నికల్లో రెట్టింపవడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.