ఏడాదిన్నర గరిష్టానికి పసిడి

– గ్రాము ధర రూ. 30,405
ముంబాయి, జనవరి25(జ‌నంసాక్షి) : బంగారం ధరంలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇటీవల పుంజుకున్న పసిడి ధర గురువారం మరింత ఎగిసింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ  గోల్డ్‌ ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. దాదాపు రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి. అటు డాలర్‌  విలువ మూడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో  పుత్తడి 156 రూపాయలు లాభపడి పది గ్రా. 30,405 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రధాన లోహాలైన వెండి, ప్లాటీనం ధరలు ఇదే బాటలోఉన్నాయి. వెంటి ధర 0.2శాతం ఎగియగా, ప్లాటీనం 0.3శాతం పెరిగింది. యుఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్యుచిన్‌ చేసిన వ్యాఖ్యల తర్వాత అమెరికా డాలర్‌ నేల చూపులు చూస్తుండటంతో, బంగారం ధర ఆగస్టు, 2016నాటి 1,361.87 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్‌పూచర్స్‌లో  0.3 శాతం పెరిగి  ఔన్స్‌ ధర 1360.60డాలర్లుగా ఉంది. 1,354 డాలర్లు ప్రధాన మద్దతు స్థాయిని అధిగమించిందనీ, ఇక బంగారం ధరలు మరింత పుంజుకుంటాయని  రాయిటర్స్‌ విశ్లేషకుడు వాంగ్‌ టావో చెప్పారు. బుధవారం దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో మాట్లాడుతూ, వాణిజ్యానికి,  ఇతర అవకాశాలకు సంబంధించి డాలర్‌ బలహీనం తమకు  మంచిదే అని మ్యుచిన్‌  వ్యాఖ్యానించారు. దీంతో డాలర్‌లో అమ్మకాలకు తెరలేచింది. మరోవైపు చమురు ధరలు భారీగా పెరగడంతో సురక్షితమైన పెట్టుబడిగా  భావించిన ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లు జరుపుతున్నట్టు బులియిన్‌ ట్రేడర్లు చెబుతున్నారు.