ఏడాదిలో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తాం

పేదవాళ్లు ఆత్మగౌరవంతోనే ఉండాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జీవైరెడ్డి కాంపౌండ్ కవాడిగూడలో 180 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన…ఏడాది లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పేదవారి జీవితాలను బాగుచేయాలన్నదే కేసీఆర్ సర్కార్ లక్ష్యమన్నారు. ఎవరూ అడగకుండానే పేదల బతుకులలో వెలుగు నింపడానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని తెలిపారు.  ఆటో డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించడంతో పాటు వృద్దులకు రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డల పెళ్లి కోసం షాదీముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా రూ. 75 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అమ్మ ఒడి పేరుతో గర్భిణీలకు రూ. 12 వేలు…. అదేవిధంగా జూన్ 2 నుంచి పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడిని ఏదో ఒక పథకంలో చేర్చి అభివృద్ధి చేస్తమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.