ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా.. 

సహాయం చేస్తుంది
– రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధి పని వెనకు కేంద్రం నిధులున్నాయి
–  వాటిని వాడుకొని తెదేపా అసత్య ప్రచారం చేస్తుంది
– బీజేపీని తిట్టడం ద్వారా బాబు రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తుండు
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
విశాఖపట్టణం, జులై12(జ‌నం సాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని నిధులు ఇస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం విశాఖలో విూడియాతో మాట్లాడిన ఆయన… కేంద్రం ఇచ్చే నిధులను వాడుకుంటూనే అధికార తెలుగుదేశం అసత్య ఆరోపణలతో బురద జల్లుతోందని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ సహా విపక్ష ప్రభుత్వాలున్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం అన్యాయం చేస్తోందనలేదన్న కన్నా… కేవలం చంద్రబాబు మాత్రమే ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సాయం చేసిన చేతులు నరికే చంద్రబాబు బుద్దికి ఇది మరో నిదర్శనమన్నారు. చట్టంలో పెట్టిన ప్రతీ అంశం పూర్తయిందని స్పష్టం కన్నా స్పష్టం చేశారు. ఒక్క గిరిజన యూనివర్సిటీ మాత్రం రావాల్సి ఉండగా ఏవిూ రాలేదని దుష్పచ్రారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల్లో సింహ భాగం పొందుతూ కూడా విమర్శలు చేయటం వెన్నుపోటుదార్ల సహజగుణమంటూ సెటైర్లు వేశారు. కడప స్టీలు ప్లాంటు విషయంలో ఏపీ ప్రభుత్వం తన కర్తవ్యాలు పూర్తి చేయకుండా నిందలు వేస్తోందని విమర్శించారు. కేంద్రం మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు సందర్శనతో ఆ ప్రాజెక్టుపై కేంద్రం, బీజేపీ చిత్తశుద్ధి మరోసారి స్పష్టమైందన్నారు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గడ్కరీ రూ. 6 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారని ప్రకటించారు. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా… గుంటూరు ఎయిమ్స్‌ సందర్శనకు వస్తున్నారని తెలిపారు. ఇక విశాఖ రైల్వే జోన్‌ వచ్చి తీరుతుందని స్పష్టం చేసిన కన్నా… కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన కర్తవ్యాలు మరచి రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని గుర్తు చేసిన కన్నా పేర్కొన్నారు.  విభజన తరువాత కేంద్రం ఏపీకి సింహ భాగం నిధులు ఇస్తోందని… నిధులు తీసుకుంటూనే కేంద్రం అన్యాయం చేస్తోందనే దుష్పచ్రారం జరుగుతోందన్నారు. ఏపీ ప్రజలు కేంద్రం చేస్తున్న సాయంపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం తోడ్పాటు ఇచ్చిందన్న కన్నా… హావిూల అమలుకు పదేళ్ల సమయం ఉందన్నారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలేనని,  లోటు బడ్జెట్‌ నిధులు దశల వారీగా ఇస్తారని తెలిపారు. ఇక 2019 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రాన్ని దోషిగా చూపిస్తున్నారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇవ్వటానికి ఏ హావిూలూ లేవు, ఆయనకు మిగిలిన ఒకే దారి బీజేపీని తిట్టి, నెపం నెట్టి ఓటు అడగటమే అన్నారు. ప్రజలంతా చంద్రబాబు చేష్టలను గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కన్నా హెచ్చరించారు.