ఏపీ అసెంబ్లీని ఘాటెక్కించిన ‘ఉల్లి’


– అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం
– సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్‌
– కౌంటర్‌ ఇచ్చిన మంత్రి కొడాలి నాని
– దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.25కే ఉల్లి అందిస్తున్నాం
– ప్రతిపక్షం ప్రతిదీ రాజకీయం చేస్తుంది
– బాబు శవరాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు
– ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి
అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీకి ఉల్లిఘాటు తాకింది. వైసీపీ-టీడీపీ మధ్య శృతిమించి మాటల యుద్ధంసాగింది. మంగళవారం ఉల్లి ధరలపై అసెంబ్లీలో చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి యోపిదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉల్లి ధరలను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే కిలో ఉల్లి ధరను సబ్సిడీపై రూ.25కే అందజేస్తున్నామని తెలిపారు.  దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఏపీలో మాత్రమే సబ్సిడీ కింద ఉల్లి అందిస్తున్నామని వివరించారు. ప్రతిపక్షం ప్రతీది రాజకీయం చేయాలని చూస్తోందని.. ఉల్లి ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. ఉల్లిధరతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి సామాన్య వ్యక్తి చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చంద్రబాబు మండిపడ్డారు. దీంతో మంత్రి కేశినేని నాని మాట్లాడుతూ.. గుడివాడలో సాంబిరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోతే.. ఉల్లిపాయల వెళ్లి చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. సాంబిరెడ్డి కొంతకాలం అనారోగ్యంతో ఉన్నారని.. ఉల్లిపాయల కోసం వెళ్లలేదని ఆయన కుటుంబం స్పష్టంగా చెప్పిందన్నారు. ఆలయానికి వెళ్లి వస్తూ దారిలో రైతు బజారుకు కూరగాయల కోసం వెళ్లి గుండెపోటుకు గురయ్యారని.. ఆస్పత్రికి తరలించగా చనిపోయారని.. కొందరు వెళ్లి ఆయన కుటుంబంపై ఒత్తిడి తెచ్చి అబద్దాలు చెప్పించారు అన్నారు. టీడీపీ, చంద్రబాబు రాజకీయాలు సాగనివ్వం అన్నారు.మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను అసెంబ్లీలో చూపించారు. గుడివాడలో చంద్రబాబు శవ రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోనని, అక్కడ ఉంది కొడాలి నాని అని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తక్కువ ధరకు ఉల్లి – సీఎం జగన్‌
ఉల్లి ధరలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే ఉల్లి పాయలు రూ.25 అందజేస్తున్నామని తెలిపారు. ఉల్లిని అతి తక్కువ ధరకు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. చౌకగా ఉల్లి ఇస్తున్నాం కాబట్టే జనాలు క్యూలు కడుతున్నారన్నారు. హెరిటేజ్‌ షాపుల్లో కేజీ ఉల్లి రూ.200కు అమ్మడం లేదా అంటూ ప్రశ్నించారు. ఏ రాష్ట్రం కూడా సబ్సిడీకి ఉల్లి ఇవ్వడం లేదని, రాబోయే రోజుల్లో మార్కెట్‌ యార్డుల్లో కూడా ఉల్లిని సబ్సిడీ కింద ఇస్తామని తెలిపారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం దిట్టని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. హెరిటేజ్‌ తమది కాదని అసెంబ్లీలో తొలిరోజే చెప్పానని.. సీఎం హెరిటేజ్‌ తనదేనని నిరూపించాలని అలా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ప్రతిపక్ష నేతగా తప్పుకుంటారనంటూ సవాల్‌ విసిరారు. లేదంటే జగన్‌ సీఎంగా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. జగన్‌పై సవాల్‌ చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు పేర్కొన్నట్లు ఉల్లిక్యూలో నిలబడి చనిపోయారని చెబుతున్న వ్యక్తి కుటుంబ
సభ్యులతో చెప్పిస్తే తాను రాజకీయాలను తప్పుకుంటానని, చంద్రబాబు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. మరోవైపు మంత్రి బుగ్గన.. హెరిటేజ్‌తో సంబంధం లేదని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని.. ఫ్యూచర్‌ గ్రూపులో హెరిటేజ్‌కు వాటాలు ఉన్నాయో లేవో చెప్పాలని చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు.