ఏపీ సీఎస్‌గా నీలంసాహ్ని బాధ్యతలు స్వీకరణ

– ఏపీకి రావటం అదృష్టంగా భావిస్తున్నానన్న సాహ్ని
అమరావతి, నవంబర్‌14(జనంసాక్షి)  : ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం సెక్రటేరియెట్‌లో ఇంఛార్జ్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ నుంచి ఆమె బాధ్యతలు అందుకున్నారు. చాలాకాలం తర్వాత తిరిగి ఏపీకి రావడం ఆనందంగా ఉందని సాహ్ని అన్నారు. తన తొలి పోస్టింగ్‌ మచిలీపట్నంలోనేనని.. మళ్లీ ఇప్పుడు అదే రాష్టాన్రికి సీఎస్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. సాహ్ని ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్‌ సర్కారు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇటీవలే బదిలీ చేసిన ఏపీ సర్కారు.. ఆయన స్థానంలో నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో కొత్త సీఈవోగా నీలం సాహ్నిని నియమిస్తూ
ఆదేశాలు జారీ చేసింది. సీఎంవో స్పెషల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.
1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్‌ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్‌ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు. నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు.