ఐఏఎఫ్‌ మార్షల్‌ అర్జన్‌ సింగ్‌ ఇకలేరు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి): భారత వైమానికదళ మార్షల్‌ అర్జన్‌సింగ్‌(98) కన్నుమూశారు. గుండెపోటుతో ఆర్మీకి చెందిన రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో శనివారం ఉదయం చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1964-1969 మధ్య ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌గా ఉన్న అర్జన్‌సింగ్‌.. ఐదు నక్షత్రాల ర్యాంక్‌ ఉన్న ఏకైక మార్షల్‌గా గుర్తింపు ఉంది. 1965 భారత్‌- పాక్‌ యుద్ధంలో అర్జన్‌ వీరోచిత పాత్ర పోషించారు.భారత వైమానికిదళ మార్షల్‌ అర్జన్‌సింగ్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గొప్ప యోధుడిని కోల్పోయాం. అర్జన్‌సింగ్‌ కుటుంబ సభ్యులకు, ఐఏఎఫ్‌ కమ్యూనిటీకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మార్షల్‌ అర్జన్‌సింగ్‌ మృతి దురదృష్టకరం. ఆయన మృతిపట్ల భారత జాతి దుఃఖిస్తుంది. అర్జన్‌సింగ్‌ జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.