ఐటీ దాడులు భాజపా కుట్రే

– ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పండి
– ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ఆదాయ పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గెహ్లట్‌ ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఆయన ఇల్లు, కార్యాలయాలు సహా మొత్తం 16 చోట్ల
ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పందించారు. తనను, తన మంత్రి వర్గంలోని ఇద్దరు సహచరులను లక్ష్యంగా చేసుకొని భాజపా ఈ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ‘మరొకరిపై ఇంకో ఐటీ దాడి జరిపే ముందు ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని వేధిస్తున్నందుకు ప్రజలకు విూరు క్షమాపణలు చెప్పాలి’ అని కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేశారు. విూరు చేస్తున్న ఈ వ్యూహాలతో ఆప్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరని అన్నారు. మొదటి నుంచి మాపై ఎన్ని ఐటీ దాడులు జరిపారో మేం లెక్కబెట్టుకుంటున్నాం. గత ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఓర్చుకోలేకే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు’ అని ఆప్‌ నేత ఒకరు ట్వీట్‌ చేశారు.