ఐటీ వలలో గుజరాత్ ఫైనాన్షియర్.. 400 కోట్ల ఆస్తులు!

kishore-bhajiawalaసూరత్, డిసెంబర్ 17: మరో నల్లధనవంతుడి బోషాణం బద్దలైంది! టీ అమ్ముకుంటూ బతికి.. వడ్డీ వ్యాపారిగా ఎదిగిన సూరత్‌లోని ఒక ఫైనాన్షియర్ ఇంట్లో 400 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.95 లక్షలు విలువచేసే కొత్త 2000 నోట్లు సహా రూ.1.33 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువ చేసే బంగారు నగలు, రూ.72 లక్షల విలువైన వెండి వస్తువులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమీషన్ పద్ధతిలో పాత నోట్ల ను కొత్తనోట్లతో మార్పిడి చేస్తున్నాడన్న సమాచారంతో కిశోర్ భజియావాలా అనే ఫైనాన్షియర్ నివాసాల్లో, ఆయన బంధువుల ఇండ్లలో మంగళవారం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ పట్టుబడిన సొమ్ము, ఆస్తుల విలువను శనివారం లెక్కించారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇతడు సూరత్ ప్రజా సహకార బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో దాదాపు 30 ఖాతాలను, 16 లాకర్లను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 31 ఏండ్ల క్రితం సౌరాష్ట్ర నుంచి సూరత్‌కు వచ్చిన కిశోర్ భజియావాలా బ్యాంకు రుణం తీసుకుని ఉద్నాగంలో చిన్న టీ దుకాణం తెరిచాడు. తర్వాతి కాలంలో బజ్జీలు కూడా అమ్మేవాడు. దాంతో భజియావాలా అయ్యాడు. తన వ్యాపారం పెరిగిన తర్వాత వడ్డీలకు ఇవ్వడం మొదలు పెట్టి.. దానినే తన వృత్తిగా మల్చుకున్నాడు. అప్పులు తీర్చలేని వారి నుంచి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఉధానా బ్రాంచ్ సూరత్ జిల్లా సహకార బ్యాంకుకు సంచుల కొద్దీ పెద్దనోట్లను పట్టుకెళ్లినట్టు సమాచారం. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.