ఐదేళ్ల పాలనలో..  దేశాన్ని ముక్కలు చేశారు

– ప్రతి రాష్ట్రం.. దేశంలో భాగమేనన్న సత్యాన్ని మోదీ మర్చారు
– ఇచ్చిన హావిూల పరిష్కారంలో విఫలమయ్యారు
– పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
– అధికారంలోకి రాగానే ప్రతివర్గానికి న్యాయం చేస్తాం
– ఎన్నికల ప్రచారంలో ప్రియాంక వాద్రా
వయనాడ్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : దేశంలోని ప్రాంతాలన్నీ ఒకటేఅన్న సూత్రాన్ని మరిచి ఐదేళ్ల భాజపా పాలన సాగిందని, కేవలం కక్షపూరిత పాలన సాగించి దేశాన్ని భాజపా ప్రభుత్వం ముక్కలు చేసిందని  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది మన దేశం.. కేరళ ప్రజలు ఈ దేశానికి చెందిన వారన్నారు. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఇలా ప్రతి ప్రాంతం ఈ దేశంలో భాగమే అని, వివిధ మతాలు, సంస్కృతుల సమ్మేళనమే మన దేశమని ప్రియాంక పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో భాజపా చేసిందేంటంటే.. ప్రజల్లో  విభజన తీసుకొచ్చిందంటూ ప్రియాంక మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూలన్నింటినీ అధికారంలోకి వచ్చాక భాజపా మరిచిందని ప్రియాంక ఆరోపించారు.’ భాజపా రైతుల  ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హావిూ ఇచ్చారని, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తామన్నారని, కానీ అధికారంలోకి రాగానే అవేవీ వారికి గుర్తుకురాలేదని ప్రియాంక విమర్శించారు. అలాగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కేరళ ప్రాంతం అంటే అమితమైన గౌరవం ఉండేదన్నారు. ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ఆమె ఎంతో విలువ ఇచ్చేవారని గుర్తుచేశారు. వాటికి భంగం కలిగించకుండానే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని పలు పథకాలను ప్రజలకు వివరించారు. తన సోదరుడు రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడుతూ.. ప్రియాంక ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ‘ఈరోజు నేను విూ ముందు ఒక చెల్లెలుగా నిలబడ్డాను. చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక వ్యక్తి తరఫున మాట్లాడుతున్నాను. గత పదేళ్లలో ఆయన(రాహుల్‌)పై అనేక రకాల దాడులు జరిగాయి. వారు(భాజపా) రాహుల్‌ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరం. ఆయన విద్యాభ్యాసాన్ని ప్రశ్నించారు. అమరుడైన ఆయన తండ్రిని ఓ దొంగ అని సంబోధించారు. అయినా అన్నింటిని తట్టుకొని విూ కోసం పనిచేయాలన్న సంకల్పంతో విూ ముందు నిలబడ్డారు’ అని రాహుల్‌ గాంధీ గురించి ప్రియాంక వివరించారు.