ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించాలి

– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
– ‘ఒంగోలు కంపెండియం’ పుస్తకావిష్కరణ
ఒంగోలు, మే20(జ‌నంసాక్షి) : ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించుకోవాలని, పశుపోషణను ఒక వృత్తిగా స్వీకరించేలా అది సేద్యానికి ఆదరువునిచ్చేలా ఉంటుందన్న భావన రైతుల్లో బలపడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఒంగోలులో ‘ఒంగోలు కంపెండియం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఒంగోలు జాతి గిత్తల గురించి సంపూర్ణంగా వివరించే ‘ఒంగోలు కంపెండియం’ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ పుస్తకాన్ని పదిహేనేళ్లు శ్రమపడి 1200 పేజీల్లో సంకలనం చేసిన రచయితలు ముళ్ళపూడి నరేంద్రనాథ్‌, మధుసూదన రావు ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. కేవలం వంద పశువుల్ని తీసుకువెళ్లిన బ్రెజిల్‌ లక్షల సంఖ్యలో స్వచ్ఛమైన, హైబ్రిడ్‌ ఒంగోలు జాతి పశువుల్ని పునరుత్పత్తి చేసి భారీ వ్యాపారం చేసుకుందని అన్నారు. కానీ ఈ జాతి పుట్టిన భారత్‌ లో మాత్రం ఈ అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించాలని, పశుపోషణను ఒక వృత్తిగా స్వీకరించేలా అది సేద్యానికి ఆదరువునిచ్చేలా ఉంటుందన్న భావన రైతుల్లో బలపడాలని అన్నారు. ఇందు కోసం పశుసంవర్ధక, వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖల మధ్య సమన్వయం పెరగాలని అన్నారు. ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముళ్లపూడి నరేంద్రనాథ్‌ కృషిని గుర్తించి బ్రెజిల్‌ క్యాటిల్‌ బ్రీడ్‌ అసోసియేషన్‌ అంతర్జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మధ్యే పద్మశ్రీ  పురస్కారాన్ని అందుకున్న రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వర రావుని సన్మానించడం ఆనంద దాయకమని, ఈ సన్మానం రైతులందరి తరఫున చేసినట్లు అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు, ఇలాంటి వారి సహకారం కూడా అత్యంత అవసరమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.