ఒంటరి పోరుతో మోత్కుపల్లి గట్టెక్కేనా

పదవుల హావిూ దక్కక పోవడంతో ప్రజల్లోకి
రెంటికి చెడ్డ రేవడిలా రాజకీయ జీవితం
యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఆలేరులో ఒంటరి పోరు చేస్తున్న టిడిపి మాజీ నేత, మాజీమంత్రి మత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు పార్టీల పవరేంటో తెలుసుకుంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేయడం అన్నది ఈ రోజుల్లో పెద్ద మైనస్‌గా కనిపిస్తోంది. ఎక్కడో ఓ చోట తప్ప స్వతంత్రులు గెలిచే అవకాశాలు తక్కువ. టిడిపిలో ఓ వెలుగువెలిగిన మోత్కుపల్లి అన్ని పదవులను అనుభవించారు. పార్టీ ఆయనకు ఉన్నత స్థానం ఇచ్చింది. అయితే అధినేత చంద్రబాబును విభేదించి బయటకు వచ్చి, ఆయనపైనే విమర్వలకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో మోత్కుపల్లి టిడిపిలో ఫైర్‌బ్రాండ్‌గా ఉంటూ ఉద్యమనేత కెసిఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. పార్టీ నుంచి బయటపడ్డాక కెసిఆర్‌ను మెచ్చుకున్నారు. ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పదవులు పొందిన మోత్కుపల్లి అవసరార్థం ఇప్పుడు కెసిఆర్‌ను భుజాన కెత్తుకుని, చంద్రబాబును తిడితే ప్రజలు నమ్మరు. దాదాపు 30 ఏళ్లపాటు పలు కీలక పదవులను అనుభవించిన తరవాత కూడా ఇలా చేయడం వల్ల రాజకీయనేతలు వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. అందుకు మోత్కుపల్లి తాజా ఉదాహరణగా చూడాలి. పార్టీ నుంచి బయటపడడానికి ముందు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. తనకు గవర్నర్‌ పదవి వస్తుందని..లేకుంటే రాజ్యసభ అయినా ఇవ్వాలని ఆయన టిడిపి అధినేతపై ఒత్తిడి చేశారు. ఈ రెండూ సాధ్యం కాలేదు. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకోవడంతో గవర్నర్‌ ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీంతో ఇక టిడిపిలో కొనసాగడం వల్ల వచ్చే లాభం లేదని గ్రహించారు. ఈ దశలో ఆయన ఇక ఖచ్చింతంగా అధికార టిఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా
భవిష్యత్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.  కొంత కాలంగా మౌనంగా ఉంటున్న మోత్కుపల్లి  టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని చర్చ జరిగింది. టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్‌లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని ప్రచారం జరిగింది. మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు ప్రచారం చేశారు. అయితే మోత్కుపల్లిని చేర్చుకునే విషయంలో కెసిఆర్‌ ఎందుకనో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. టీడీపీని తెలంగాణలో బతికించుకోవడానికి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆ తర్వాత మోత్కుపల్లి విూడియాకు వివరించారు. అంతగా టిడిపిపై ప్రేమ ఉన్న వ్యక్తి పార్టీని వీడి అధినేతపై విమర్వలు చేయడం ఏరుదాటిన తరవాత తెప్పతగిలేసిన విధంగా ఉంది. ఇకపోతే తాను కోరుకున్న గవర్నర్‌ లేదా రాజ్యసభ పదవి రాకపోవడంతో పాటు పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం మోత్కుపల్లి బయటపడక తప్పలేదు.  దీంతో ఇప్పుడు ఏ రాజకీయపార్టీ అండగా లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆలేరుకు గోదావరి జలాలు తీసుకుని రావడమే తన లక్ష్యమని అంటూ ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి జలాల తరలింపు ఉంది. 30 ఏళ్లుగా ఆయన ఈ విషయమై ఒక్కనాడూ మాట్లాడలేదు. అవకాశ వాద రాజకీయాలను ప్రజలు ఏనాడూ సహించరు. ఇవే చివరి ఎన్నికలని ఆలేరులో నిలబడ్డా మోత్కుపల్లిని గతంలో ఆదరించిన ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి.