ఒకే కుటుంబం కోసం తెలంగాణ రాలేదు


– ఎంతోమంది బలిదానాలతో వచ్చింది
– నదుల పారే ప్రాంతాన్ని ఎడారిగా మర్చారు
– రాజకీయాలకోసమే ముస్లింల రిజర్వేషన్లు తెరపైకి
– రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌, తెరాసకు లేదు
– తొలి ప్రధాని పటేల్‌ అయ్యుంటే రైతులకు ఈ దురవస్థ పట్టేది కాదు
– 2020నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
– కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పోరు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ కుస్తీ పోరులాంటింది
– సోనియా, చంద్రబాబుల వద్ద శిక్షణ పొందిన వ్యక్తే కేసీఆర్‌
– అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధిచేయలేడు
– బీజేపీ గెలుపుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
– పాలమూరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మహబూబ్‌నగర్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : అమరులు, తెలంగాణ ప్రజల పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఒకే కుటుంబం కోసం తెలంగాణ రాలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ప్రాంతం ఎడారిగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. ఒకే కుటుంబం కోసం ఈ తెలంగాణ రాలేదన్నారు. దేశాన్ని నాలుగు దశాబ్దాలు ఒక కుటుంబం కబ్జా చేసిందని, తెలంగాణను నాలుగేళ్లుగా ఓ కుటుంబం కబ్జాచేసి కూర్చుందని సోనియా, కేసీఆర్‌లను ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పోరు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ కుస్తీ పోటీలాంటిదని మోదీ అభివర్ణించారు. కేసీఆర్‌ తెలంగాణలో అభివృద్ధిని మరచి కుల రాజకీయాలు ముందుకు తెచ్చారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ మతఘర్షణలు తెస్తే… ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అదే పనిచేస్తోందన్నారు. రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్‌ ముస్లిం రిజర్వేషన్లు అంటోందని మోదీ విమర్శించారు. పవిత్ర కృష్ణానది ప్రవహిస్తున్న ప్రాంతమిదని, జోగులాంబ శక్తి పీఠం ఉన్న పుణ్యభూమిదని, పాలమూరును అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రధాని స్పష్టం చేశారు. పాలమూరు అంటే పాలు, నీళ్లు అని అర్థమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెరాస అధినేత కేసీఆర్‌.. చంద్రబాబు, సోనియాల దగ్గర శిక్షణ పొందిన వ్యక్తే అని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లలేడని నరేంద్రమోదీ విమర్శించారు. దేశ స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒకే ఒక్క కుటుంబం దేశంలో తిష్టవేసుకుని కూర్చొందన్నారు. నయా తెలంగాణలో కూడా గత నాలుగున్నరేళ్లుగా ఒకే కుటుంబ తిష్ట వేసుకుని కూర్చొందన్నారు. ఇక్కడున్న నాయకులకు ఏది పడితే అది మాట్లాడటం అలవాటైపోయిందని మోడీ అన్నారు. ఇక్కడ పాలించే వాళ్ల పాదాల దగ్గర పడి ఉండాలని వారు కోరుకుంటున్నారని, స్వాభిమానం కోసం పోరాడిన విూరు ఎవరి పాదాల వద్దా కూర్చొనే అవసరం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. ఇది తెలంగాణ నవ యువకుల రుణం తీర్చుకునే అవకాశమన్నారు. ఒక్క కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా గెలవకుండా చూడాల్సిన బాధ్యత ఓటర్లదేనన్నారు. కాంగ్రెస్‌ ఆంధప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని, ఇప్పుడు వారు తన్నుకుంటుంటే చూస్తూ ఆనందిస్తోందన్నారు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో సమస్యలు ఉన్నాయని,
వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాలను శాంతియుత పరిస్థితుల మధ్య విభజించి ఇచ్చారన్నారు. అవి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మోడీ అన్నారు. తెలంగాణ కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వ అన్ని అనేక పథకాలను తీసుకొచ్చిందని, యూపీఏ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏమేం తెచ్చారో అంతకంటే ఎక్కువ భాజపా రాష్ట్రానికి ఇస్తుందని అన్నారు. ఆనాడు పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. పటేల్‌ యోగధానం వల్లనే మనం భారత్‌మాతాకీ జై అనే నినాదం ఇవ్వగలుగుతున్నామన్నారు. వీలు చిక్కినప్పుడు గుజరాత్‌లో ఉన్న పటేల్‌ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించండని కోరారు. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను మంజూరు చేస్తామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైలు మార్గాల ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని,  రోడ్డు, రైలుకు సంబంధించిన 20కిపైగా ప్రాజెక్టులు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయ న్నారు. మౌలిక వసతులకు సంబంధించి 40 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. ఈ పనులన్నింటికీ కేంద్రం రూ.30వేల కోట్ల నిధులు అందిస్తోందని, సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ నినాదాన్ని భాజపా నమ్ముతోందన్నారు. మన తొలి ప్రధాని సర్దార్‌ పటేల్‌ అయి ఉంటే రైతులకు ఈ దురవస్థ పట్టేది కాదన్నారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌, తెరాసకు లేదని మోడీ విమర్శించారు. రైతుల దుస్థికి కాంగ్రెస్‌, తెరాసల పాలనే కారణమన్నారు. 2020 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే సంకల్పం మాకు ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న పేరు గొప్ప.. ఊరు దిబ్బ నాయకులను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్‌ హయాంలో అందిన స్వామినాథన్‌ సిఫార్సులను ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు పెట్టుబడి వ్యయం ఇచ్చి ఉంటే రైతుల కష్టాలు తొలగిపోయేవన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమంపై దృష్టి సారిస్తామన్నారు. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టిన కాంగ్రెస్‌ను రానిద్దామా అని మోడీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తానని కేసీఆర్‌ మాటిచ్చారని, కానీ ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, తెరాసల ఒకే నాణెళినికి ఉన్న బొమ్మా బొరుసు వంటివన్నారు. అందుకే భాజపాకు ఓటేసి తెలంగాణ ఉజ్వల భవిష్యత్‌ సహకరించండని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.