ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

– బొలేరో వాహనం, లారీ ఢీ
– బొలేరోలో ప్రయాణిస్తున్న10మంది అక్కడికక్కడే మృతి
ఒడిశా, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నౌపదా జిల్లాలోని సిల్దా సవిూపంలో హైవేపై బొలేరో-లారీని ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతిచెందారు. బొలేరోలో ప్రయాణిస్తున్నవారు దసరా కావడంతో మంగళవారం ఒడిశాలోని కోమ్నాకు వెళ్లారు. అక్కడి వైష్ణవీ దేవిని దర్శించుకొని బుధవారం తిరిగి తమ సొంతఊర్లకు బయల్దేరారు. బొలేరో సరిగ్గా సిల్దా దగ్గరకు రాగానే ప్రమాదం జరగ్గా.. ప్రమాదంలో బొలేరో మొత్తం నుజ్జు, నుజ్జయ్యింది. వాహనంలోని 10మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో ముగ్గురు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా చెబుతున్నారు. ప్రమాదం వేకువ జామున మూడు గంటలకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బొలేరో వాహనం డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ప్రమాదంలో రెండు కుటుంబాల వారు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.