ఒబామా చేయలేని పనిని చేయబోతున్నాను: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని, డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం రష్యానే ఈ పని చేసిందనే ఆరోపణలు అమెరికాను ఓ కుదుపు కుదిపాయి. అప్పుడప్పుడూ ఈ హ్యాకింగ్ సంబంధించిన ఏదోఒక ఆరోపణ బయటకు వస్తూనే ఉంది. ఈ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం ఊహించలేని ఓ ప్రకటన వెలువరించారు. రష్యాతో కలిసి ‘సైబర్ సెక్యూరిటీ యూనిట్’ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.  అమెరికా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో హ్యాకింగ్ జరగకుండా ఉండేందుకు రష్యాతో కలిసి పని చేయనున్నామని స్పష్టం చేశారు. జీ20 సదస్సులో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తాను సమావేశమయ్యానని,  హ్యాకింగ్ ఆరోపణలపై చర్చించామని, అలాంటిదేమీ జరగలేదని పుతిన్ తెలిపారని ట్రంప్ తేల్చేశారు. హ్యాకింగ్‌కు సంబంధించిన సమాచారం ఒబామాకు ముందే తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒబామా చేయలేని పనిని తాను చేయబోతున్నానని, హ్యాకింగ్ నిరోధానికి రష్యాతో కలిసి చర్యలు తీసుకుంటానని ట్రంప్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన ఈ విషయాలను తెలిపారు. హ్యాకింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన రష్యాతోనే ట్రంప్ జట్టు కట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.