ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించనున్న సానియా విూర్జా

` ఇండియా తరపున 4 ఒలింపిక్స్‌లలో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచే అవకాశం
హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి):ఇండియన్‌ టెన్నిస్‌లో సంచలనం మన సానియా విూర్జా. దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించబోతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలవబోతోంది. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ గేమ్స్‌ కోసం సానియా ముమ్మరంగా సాధన చేస్తోంది.ఈ సందర్భంగా ఆమె ఒలింపిక్స్‌.కామ్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. తనది అద్భుతమైన కెరీర్‌ అని, తనపై, తన సామర్థ్యా లపై తనకు నమ్మకం వల్లే ఇది సాధ్యమైందని ఆమె చెప్పింది. 30ల్లో ఉన్న తాను ఇంకా ఎన్ని రోజులు ఆడతానో తెలియదని, అయినా భవిష్యత్తులోకి ఎక్కువగా చూడటం తనకు అలవాటు లేదని సానియా తెలిపింది. 2018లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. గతేడాది మళ్లీ టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతో హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ డబ్ల్యూటీఏ టోర్నీ గెలిచింది.ఇప్పుడు వింబుల్డన్‌, ఒలింపిక్స్‌కు ముందు ఈస్ట్‌బౌర్న్‌ టోర్నీలో ఆడుతోంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలోకి దిగిన సానియా.. నాలుగోస్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయింది. ఇలా దగ్గరిదాకా వచ్చి మెడల్‌ అందుకోలేకపోవడం తన జీవితంలో అత్యంత విషాదకరమైన సందర్భమని ఆమె చెప్పింది. రానున్న ఒలింపిక్స్‌లో డబుల్స్‌ ఈవెంట్‌లో 95వ ర్యాంక్‌లో ఉన్న అంకితా రైనాతో కలిసి బరిలోకి దిగనుంది.రికార్డు స్థాయిలో నాలుగోసారి ఇండియా తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉన్నదని సానియా చెప్పింది. ఒలింపిక్స్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తొలిసారి టాప్‌ 100లోపు ఉన్న ఇండియన్‌ ప్లేయర్‌తో కలిసి సానియా డబుల్స్‌ బరిలోకి దిగుతోంది.