ఓటింగ్‌లో పాల్గొనేందుకు.. నగరజనం నిరాసక్తి..

 

భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం

సాయంత్రం 5 గంటల వరకు 36.73శాతం ఓటింగ్‌

కోవిడ్‌భయం,వరుససెలవులతో ఓటేయని హైదరాబాద్‌ ఓటర్లు

యువతకు పోటీగా ఓటు వేసిన వృద్ధులు, వికలాంగులు

హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్‌ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్‌.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకున్నది.149 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం. కరోనా భయం, వరుసగా సెలవులు రావడం, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ ¬ం చేస్తుండటంతో నగరవాసులు ఓటు వేయడానికి రాలేకపోయారని అంచనా వేస్తున్నారు. ఈ సారి యువతకు పోటీగా వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి కేంద్రాలకు తరలివచ్చారు. పలు చోట్ల ప్రధాన పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి పాతబస్తీలో అనేక చోట్ల పోలింగ్‌ బూత్‌లు ఖాళీగా దర్శన మిచ్చాయి. పాతబస్తీ అంతటా 25 శాతం పోలింగ్‌ మించలేదని అధికారులు అంటున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా తక్కువ శాతం పోలింగ్‌ నమోదు అయింది. పలు పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు అయింది. లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్‌ నమోదు అయింది. అత్యధికంగా బాగ్‌అంబర్‌పేట్‌ 64.82 శాతం, అత్తాపూర్‌ 54.95, బంజారాహిల్స్‌ 35.50, జూబ్లీహిల్స్‌ 30.08 శాతం, శేరిలింగంపల్లి సర్కిల్‌ 22.80, చందానగర్‌ సర్కిల్‌ 22.55 శాతం. కూకట్‌పల్లి సర్కిల్‌ 26.04, రామచంద్రాపురం సర్కిల్‌ 21.71 శాతం. రామచంద్రాపురం, పటాన్‌చెరు సర్కిల్‌ 51.71, అంబర్‌పేట్‌ సర్కిల్‌ 42.49 శాతం. ఉప్పల్‌ 37.01, ఎల్బీనగర్‌ 37.01, గాజులరామారం 36.65, అల్వాల్‌ 36.44 శాతం, రాజేంద్రనగర్‌ 35.45, హయత్‌నగర్‌ 34.79, చార్మినార్‌ 34.75 శాతం. మూసాపేట్‌ 34.25, ముషీరాబాద్‌ 32.93, మల్కాజ్‌గిరి 30.56, జూబ్లీహిల్స్‌ 30.45 శాతం అయింది. యూసుఫ్‌గూడ 29.66, సికింద్రాబాద్‌ 29.15, గోషామహల్‌ 28.72 శాతం, ఖైరతాబాద్‌ 28.63, కుత్బుల్లాపూర్‌ 28.41, సనత్‌నగర్‌ 27.51 శాతం చాంద్రాయణగుట్ట 26.88, మెహిదీపట్నం 26.88, సరూర్‌నగర్‌ 26.61 శాతం, బేగంపేట్‌ 26.19, కూకట్‌పల్లి 26.04, కాప్రా 25.43, శేరిలింగంపల్లి 22.80 శాతం, చందానగర్‌ 22.55, ఫలక్‌నుమా 22.53, కార్వాన్‌ 20.35 శాతం, అత్యల్పంగా మలక్‌పేట్‌ సర్కిల్‌లో 18.86 శాతం పోలింగ్‌ నమోదు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ముగియనుంది. గత పోలింగ్‌ శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 2016 జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ శాతం 45.29 పోలింగ్‌ నమోదు అయింది. ఈసారి 40 శాతంలోపే ఓటింగ్‌ ఉంటుందందని ఎన్నికల అధికారులు అంటున్నారు.

ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: మంత్రి కేటీఆర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్క నగర పౌరుడికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు, సోషల్‌ విూడియా వారియర్స్‌ కి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. 150 డివిజన్స్‌లో పోలింగ్‌ జరుగుతుండగా, గ్రేటర్‌ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్స్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. కొద్ది సేపటి క్రితం మెగాస్టార్‌ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు. ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, దర్శకుడు క్రిష్‌, యాంకర్‌ ఝాన్సీ, నటుడు ఆలీ, సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ, నిర్మాత ఉషా ముళపారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో వీరు ఓటు వేశారు. నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకొడి ఓటింగ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రజలు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. మంచు లక్ష్మీ ఫిలిం నగర్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. విజయ్‌ దేవరకొండ సహా ఆయన కుటుంబ సభ్యులు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ జూబ్లీహిల్స్‌ లో ఓటు వేశారు. డైరెక్టర్‌ తేజ, కోట శ్రీనివాస రావు, రైటర్‌ బీవీఎస్‌ రవి, హీరో రామ్‌, నిఖిల్‌, సాయిధరమ్‌ తేజ్‌ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.