ఓటును సద్వినియోగం చేసుకోండి

కరీంనగర్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): 7న శుక్రవారం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. యువత ఓటరు నమోదులో ఉత్సాహం చూపినట్లే.. ఓటింగ్‌లోనూ చైతన్యంతో ముందుకు సాగాలని కోరారు.యువత డబ్బు, మద్యం, బహుమతులకు లొంగకుండా అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా పెద్దఎత్తున ఓటింగ్‌లో భాగస్వాములు కావాలన్నారు. వికలాంగులు వరుసలో నిలబడకుండా నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయిదేళ్లకోసారి వచ్చే ఓటుకు దూరమైతే నష్టం తప్పదని సూచించారు. ఏదేని గుర్తింపుకార్డు, ఆధార్‌ కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, భయపడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కేంద్ర బలగాలు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, స్థానిక పోలీసులతో కమిషనరేట్‌లోని అన్ని గ్రామాల్లో, ప్రాంతాల్లో 563 ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించామన్నారు. కమిషనరేట్‌లోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేకాధికారులను నియమించి భద్రతకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.