ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు

పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు
ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): లోక్‌సభ ఓట్ల లెక్కింపు రోజు గురువారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు భద్రతపరంగా పలు ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు పరిసరాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో రికార్డింగ్‌ జరిగేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ, సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో మొత్తం మూడు చోట్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఇటువైపు దారులన్నీ మూసి వేయనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వైపు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. జిల్లా ఎస్‌పీ విష్ణు వారియర్‌ ఆధ్వర్యంలో కుమురంభీం, నిర్మల్‌ ఎస్‌పీలు పర్యవేక్షించనున్నారు. కేంద్రాల నుంచి వంద విూటర్ల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.  పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద నిర్మల్‌ ఎస్‌పీ, బాలికల పాఠశాల
వద్ద కుమురంభీం ఎస్‌పీ బందోబస్తు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ప్రణాళికాబద్దంగా బందోబస్తు పక్రియను రూపొందించి కార్యాచరణ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించవద్దన్నారు. మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశించారు.