ఓ మద్యంచుక్క వంద అనర్థాలకు మూలం!

C

మద్యరహిత తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యం

మద్యంతో పేదల ఇళ్లు గుల్లవుతున్నాయి

ఆరోగ్యశ్రీ కేసుల్లో 90 శాతం లిక్కర్‌ కేసులే

సర్కారీ గుడుంబా అసలొద్దు

తెలంగాణ పోరాట స్పూర్తితో సంపూర్ణ మద్యనిషేధం కోసం పోరాడుదాం

మద్యం మహమ్మారిపై జనంసాక్షి’ ప్రత్యేక కథనం

ఓ మద్యంచుక్క లక్ష అనర్థాలకు మూలం. ప్రతి నేరానికీ మద్యానికీ అవినాభావ సంబంధం ఉంటోంది. పేదల కష్టార్జితం మద్యం షాపులు నిలువుదోపిడీ చేస్తున్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 47 మద్యరహిత సమాజాన్ని స్థాపించమంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలకులు వీధికి రెండు లిక్కర్‌ షాపులు తెరిచేశారు. పాలు దొరకని ప్రదేశాలున్నాయికానీ మద్యం దొరకని జాగా లేదు. జనం ఈ షాపుల ముందు కిక్కిరిసి కనబడతారు. జనానికి అనారోగ్యాన్ని మిగిల్చి బడా కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 90 శాతం కేసులన్నీ ఈ మహమ్మారి వల్ల వస్తున్నవే. ఇటీవల సర్కారే గుడుంబా తయారుచేస్తున్నట్లుగా కథనాలొస్తున్నాయి. సర్కారీ గుడుంబా అసలే వద్దు. బంగారు తెలంగాణ కోసం స్వరాష్ట్ర సాధన పోరాట స్ఫూర్తితో సంపూర్ణ మధ్య నిషేధం కోసం మరోమారు పోరాటానికి సిద్ధమవుదాం.
హైదరాబాద్‌, జనంసాక్షి:వెనుకబడిన తరగతుల జనాలు అధికంగా నివసించే తెలంగాణ ప్రాంతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వరాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేస్తే.. తెలంగాణలోని ఎంతో మంది పీడిత ప్రజలు సుఖసౌఖ్యాలతో వర్దిల్లుతారు. మద్యం మూలంగా అనారోగ్యం పాలవుతున్న పేదల సంఖ్య ఇక్కడ గణనీయంగా పెరుగుతోంది. మద్యం తాగడం కోసం తలసరి ఆదాయానికి మించి అప్పు చేస్తున్నారు బడుగు జీవులు. దీంతో కుటుంబమంతా పస్తులు పడుండాల్సి వస్తోందంటే పరిస్థితి ఎలా దాపురిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. తప్పతాగిన కుటుంబపెద్ద సోయిలేకుండా ఉంటే.. కూడు లేక డొక్క మాడ్చుకుని పడుకునే కుటుంబాలు ఇంకా ఉన్నాయంటే ఆశ్చర్యమే. కానీ ఇది కాదనలేని నిజం. రెక్కాడితే గాని డొక్కాడని పేదోడు పొద్దుగూకంగనే పావు మింగందే నిద్రపట్టడంలేదంటూ మద్యానికి బానిసవుతున్నాడు. మందు కోసం నెలకు వచ్చిన రేషన్‌ సరుకులు కూడా అమ్మేసి తప్పతాగి తూలుతున్నాడు. అదేమని అడిగితే ఆ ఇల్లాలి తాట వలుస్తున్నడు. అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లల నోటికాడి కూడు ఇలా మందుపాలవటం ఎంత దారుణం. మద్యం మాఫియాగా ఎదిగిన నేతలు కాంట్రాక్టర్ల సారాకాస్తుండటంతో పాలు కూడా దొరకని ప్రాంతముంటుందేమో కానీ మద్యం దొరకని ఇలాఖా లేకుండా తయారైంది. బడుగు జీవుల బతుకులను చిద్రం చేస్తున్న ఈ దుర్భరస్థితి నుండి సగటు పేదోడు బయట పడాలంటే వాణ్ణి మందుకు దూరంగా ఉంచాలె. కానీ అది ఎవడబ్బ తరం కావట్లేదు. అందుకే వానికే మందును దూరం చెయ్యాలె. సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేయాలె. బంగారు తెలంగాణ కలలు కంటున్న మనం తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటం చేసిన స్పూర్తితో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని నడపాలె.
మనదేశంలో ఇప్పటికే గుజరాత్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాలు సహా, మణిపూర్‌లోని కొన్ని జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతం లక్ష్యదీప్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. ఇటీవలే కేరళ కూడా పదేళ్లలో పూర్తి మధ్యనిషేదం అమలు చేసేందుకు ఇటీవలే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కేరళలోని పలు బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలు చాలావరకు మూసివేసిన్రు. మొన్నటి దాకా దేశంలోనే అత్యధిక మద్యం సేవిస్తున్న రాష్ట్రంగా కేరళకు రికార్డు ఉండేది. ఇప్పటికే ప్రతి నెల 1తారీకుతోపాటు ఆదివారంనాడు మందు దుకాణాలు బంద్‌ చేస్తున్రు. దీనివల్ల కేరళ ప్రభుత్వానికి ఆదాయంలో 8వేల కోట్ల రూపాయల గండి పడుతోంది. అయినా సరే ప్రభుత్వం మాత్రం మద్యనిషేధాన్ని అమలుచేయటంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. దీనికి అక్కడ మద్యపానానికి వ్యరేకంగా వెల్లువెత్తిన ప్రజాఉద్యమాలే కారణం. మరి రాష్ట్రరాజధానిలో కేరళ భవన్‌ నిర్మిస్తామంటున్న సర్కారు పెద్దలు మద్యనిషేధం విషయంలోనూ కేరళను ఆదర్శంగా తీసుకోవాలె. అసలు ప్రజా ఉద్యమాల మాట అటుంచితే… భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రభుత్వాలు సారాపై నిషేదం విధించాలి. మద్యపానాన్ని ప్రోత్సహించకుండా దుకాణాలు, బార్లను నియంత్రించాలి. బహిరంగంగా మద్యం తాగేవాళ్లపై కేసు నమోదు చేయాలి. పర్మిట్‌ గదులు, బెల్టు దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించాలి. మద్యం దుకాణాల పనివేళలు కుదించాలి. తాగుడు అనర్థాలపై గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు, జనచైతన్య బృందాలతో ప్రదర్శనలు నిర్వహించాలి. అలా దశలవారీగా మద్యపాన నిషేధం చేసి పేదలకు మద్యం అందుబాట్లో లేకుండా చేయాలి. మద్యం ప్రకటనలపై నిషేదం విధించటమే కాక 21యేళ్ల లోపు వారికి అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. చట్టంలో ఇన్ని కఠిన నిబంధనలున్నా వాటి అమలు తీరులోనే నీలినీడలు అలుముకున్నాయి. మద్యం విధానంలో ప్రతిసారీ కొత్త సీసాలో పాత సారా నింపుతున్నారు తప్ప ఒరిగేదేమీ ఉండట్లేదు.

మద్యం విషంకన్నా ప్రమాదకరమైందని మహాత్మ గాంధీ ఏనాడో చెప్పారు. విషం శరీరాన్ని చంపితే, మద్యం మానవత్వాన్ని చంఫుతుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్నే గాంధీ మద్యనిషేధం అవసరాన్ని వివరించారు. ఎక్సైజ్‌ పన్నుల విధానం అత్యంత అనైతిక పన్నుల విధానమన్నారు. ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే ఆదాయంకంటే మద్యం మానేసిన వ్యక్తి ఆదాయం పెరగడమే దేశానికి అవసరమని గాంధీ అన్నారు. కానీ గాంధీ ఆశయాలకు పూర్తి విరుద్ధంగా నేటితరం పాలక వర్గాలు వ్యవహరిస్తున్నాయి. మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కల్పవృక్షంలా భావిస్తున్నారు. పేదల సంక్షేమ పథకాల కోసం అదే పేదలరక్తాన్ని పిండి వసూలు చేయటానికి అనువైన, అతి సులువైన మార్గంగా మద్యం అమ్మకాలను ఎంచుకున్నాయి. 1995లో నాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీయార్‌ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తే… మామను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న మన రెండుకళ్ల బాబు చంద్రబాబు 1997లో మద్యనిషేధాన్ని ఎత్తివేసిన ఘనుడుగా కీర్తికెక్కిండు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విధానం రూపొందించుకోవచ్చు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో మద్యం విధానాలను రూపొందిస్తున్నాయి. మద్యం ఒక బారీ ఆదాయవనరుగా కనిపించడం వల్లనే దీనిపై నిషేధం ఎత్తివేయలేని పరిస్థితుల్లో పాలకులు కూరుకుపోయారు. బాబుకు కొనసాగింపుగా బాబు తర్వాత అధికారంలోకొచ్చిన వైఎస్‌ కూడా అబే బాటలో నడిచిండు. ఈ ఇరువురు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో బెల్టు షాపులు, మద్యం దుకాణాలు, బార్లు విచ్చలవిడిగా రాజ్యం చేసినయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బెల్టు షాపులు పెరిగిపోయి పేదల నోట్ల మట్టి కొట్టి ప్రభుత్వ ఖజానా నింపుతున్నరు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని స్వరాష్ట్రంలో పేదలకు మద్యం నుంచి విముక్తి ప్రసాదించాలె. ఎందరో తాగుడు బానిసలకు విముక్తినిచ్చి మహిళల దీపం చక్కబెట్టాలె. వాళ్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలె. మద్యం నిషేధం వల్ల అనేక ప్రయోజనాలున్నా వాటిని విస్మరించి కేవలం ఆదాయ వనరుగా మాత్రమే మద్యాన్ని చూడటం వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. నిజానికి మద్యనిషేధం వల్ల నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి. మానవ వనరులు సద్వినియోగమవుతాయి. మద్యం తాగేవారు సైతం మితంగా తాగినా చేటేనని, అదే అలవాటుగా మారిపోతుందని గుర్తించాలి. మద్యపానం వల్ల హృద్రోగాలు, శ్వాసకోస వ్యాధులు, ఇతర ఎన్నో జబ్బులు వస్తాయని గుర్తుంచుకోవాలి. మద్యం విషయంలో ప్రభుత్వం సైతం నిర్దిష్ట ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఉంది. మహిళా ఉద్యమాలు వచ్చినా ప్రభుత్వాలకు పట్టింపులేకపోవడం శోచనీయం. అందుకే మహిళలు కూడా మద్యపాన నిషేధ ఉద్యమాల్ని మరింత ఉదృతంగా చేపట్టాలి. జిల్లాకో డీ అడిక్షన్‌ సెంటరున్నా వాటివల్ల ప్రయోజనం మాత్రం శూన్యం. చాలా చోట్ల వీటి పనితీరుపై విమర్శలున్నాయి. ఇన్ని చేసినా ప్రయోజనం ఉండట్లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే మద్యపాన నిషేధం విధిస్తూ నిర్దిష్ట విధానాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్కారీ గుడుంబా తయారవుతోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అలాంటి ఆలోచనలకు తావు లేకుండా సర్కారు వ్యవహరించాలె. కరళ తరహాలో ఇప్పటికైనా కార్యచరణ మొదలుపెడితేనే స్వరాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమమవుతుంది.