ఓ వైపు పంచాయితీ..మరో వైపు మున్సిపల్‌

ఎన్నికల ఏర్పాట్లలో అధికారుల బిజీ
ఆదిలాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ఒకవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలనూ అధికార యంత్రాంగం ముందస్తుగా ప్రారంభించింది. అధికారులు ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ముందు తీసుకోవాల్సిన చర్యల్లో నిమగ్నమైంది.మున్సిపాలిటీలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్‌ స్టేషన్లతో పాటు ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను
గుర్తించాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. ప్రతి వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఎంత మంది ఉన్నారు? మహిళా ఓటర్లు ఎంత మంది ఉన్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకొని రొటేషన్‌ ప్రకారం వార్డులకు రిజర్వే షన్లను ఖరారు చేస్తారు. పట్టణంలోని మొత్తం ఓటర్ల ఆధారంగా ఎన్ని పోలింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయి? ఎన్నికల సిబ్బంది నియామకం తదితర చర్యలను మున్సిపల్‌ పాలకవర్గం గడువు ముగియక ముందే సిద్ధం చేసి ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత జూన్‌ నెలలోనే గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో కొత్తగా వార్డులను పెంచేందుకు అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే ఓటర్లను ప్రామాణికంగా తీసుకొని వార్డుల విభజనకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ఎ/-లానింగ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు సమావేశమై విలీనమైన కాలనీల్లో ఉన్న ఇంటి నంబర్లు, జియోగ్రాఫికల్‌ సాంకేతికతను ఉపయోగించి వార్డుల విభజన చేపట్టారు. ఈ మేరకు ఒక డ్రాఫ్ట్‌ ప్రపోజల్‌ను సిద్ధం చేసి ప్రజాభిప్రాయానికి ఉంచారు. వీటికి సంబంధించిన వివరాలను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, ఎంపీ నగేశ్‌, మున్సిపల్‌ కౌన్సిర్లకు కూడా అందించారు. ఈ నెల 20వ తేదీలోగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను క్రోడీకరించి కమిషనర్‌ సీడీఎంఏకు నివేదిం చనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సంప్రదింపుల తర్వాత అధ్యయనం చేసి ఈ నెల 31లోగా తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.