ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బీభత్సం

బైకుపై వెళుతున్న విద్యార్థి మృతి
మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొట్టడంతో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా కారు టైర్‌ పేలడంతో డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకుచ్చింది. దీంతో అటుగా వస్తున్న రెండు బైక్‌లను కారు ఢీకొట్టింది. ఒక బైక్‌పై అవంతి కాలేజ్‌కు చెందిన వినంత్‌, మనీష్‌, మరో బైక్‌పై బ్రిలెంట్‌ కాలేజ్‌కు చెందిన పృద్ధన్‌, ఉమర్‌ ఉన్నారు. వీరిలో వినింత్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో  మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులు. మృతుడు జి. వినీత్‌(22) రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడు వినీత్‌ అబ్దుల్లా పూర్‌మెట్‌ మండలంలోని అవంతి ఇంజినీరింగ్‌ కళాశాల్లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువు తున్నాడు. క్షతగాత్రులు మనీష్‌ కూడా సిరిసిల్ల జిల్లా వాసి. అతడూ అదే కళాశాల్లో చదువుతున్నాడు. మరో ఇద్దరు క్షతగాత్రులు రిజ్వాన్‌, ఉస్మాన్‌ హైదరాబాద్‌ మలక్‌పేటకు చెందిన వారు కాగా.. వీరు బ్రిలియంట్‌ కళాశాల్లో చదువుతున్నారు. కారు టైరు పేలడంతోనే అదుపు తప్పి ప్రమాదానికి కారణమైనట్లు పోలీపులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం హయత్‌ నగరలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సుబోల్తా: విద్యార్థులకు గాయాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో స్కూల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.