కంగారుల భరతం పట్టారు

– ఆస్టేల్రియాను చిత్తుచేసిన పాకిస్థాన్‌
– 373పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన ఆస్టేల్రియా
అబుదాబి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : పాక్‌ ఆటగాళ్లు కంగారుల భరతం పట్టారు. ఫలితంగా యూఏఈ వేదికగా ఆస్టేల్రియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్థాన్‌ 1-0తో చేజిక్కించుకుంది. అబుదాబిలో శుక్రవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అత్యద్భుతంగా రాణించిన పాకిస్థాన్‌ 373 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ని చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసిన పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌ని 400/9 వద్ద డిక్లేర్‌ చేసింది. ప్రతిగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 145 పరుగులకే కుప్పకూలిన ఆస్టేల్రియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 164కే ఆలౌటైంది. పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ 10/95 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసి మ్యాచ్‌ ఫలితాన్ని శాసించాడు. తొలి టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ (94), కెప్టెన్‌ సర్ఫరాజ్‌ మహ్మద్‌ (94) నిలకడగా ఆడటంతో 81 ఓవర్లలో 282 పరుగులకి పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్టేల్రియా జట్టులో కనీసంఒక్కరు కూడా అర్ధశతకాన్ని నమోదు చేయలేకపోయారు. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (39) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. దీంతో.. 50.4 ఓవర్లలోనే ఆస్టేల్రియా 145 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 137 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పాక్‌కి లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో బాబర్‌ అజామ్‌ (99), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (81) నిలకడగా ఆడటంతో.. 400/9 వద్ద ఇన్నింగ్స్‌ని డిక్లేర్‌ చేసిన పాక్‌.. 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్టేల్రియాకి నిర్దేశించింది. ఛేదనలో మరోసారి విఫలమైన ఆసీస్‌ 164కే చేతులెత్తేసింది. బుధవారం అబుదాబి వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది.