కంది, మిర్చిరైతులకు దక్కని మద్దతు

తీరా ఇప్పుడు అకాల వర్షం దెబ్బ

తడిసిన పంటలతో కుదేలయిన రైతన్న

ఆదుకోవాలని వేడుకోలు

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కందిరైతుల కష్టాలు తీరడంలేదు. నిత్యం వారు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. కందులను ఎందుకు పండించామా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. అధికారుల మాటలు నమ్మి పత్తిని తగ్గించి ఆ స్థానంలో ఇతర పంటలు వేసిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వాటికి సరైన ధరలు లేక బెంబేలెత్తుతున్నారు. జనగామ, ఎనుమాముల, కేసముద్రం మార్కెట్‌ యార్డుల్లో మొన్నటి వరకు కందుల,మిర్చి కొనుగోలు కేంద్రాలు సరిగా నడవక రైతులు తీవ్ర నష్టపోయారు. తాజాగా భారీ వర్షాలు రైతులను దెబ్బతీసాయి. తమకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 6 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. పత్తితో తీవ్ర నష్టం కల్గుతోందని, దానికి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని అధికారులు గతేడాది సూచించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలో రైతులు కంది, పెసర, మిరప, మొక్కజొన్న,

పసుపు పంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచారు. మద్దతు ధరను ప్రకటించినా మార్కెట్‌కు సరకు తీసుకెళ్తే అది దక్కడం లేదు. అధికారులు ఆదేశించినా ఫలితం లేకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కందులకు మంచి ధర లభించింది. దిగుబడి బాగానే ఉన్నా, ధర విషయంలో మాత్రం చుక్కెదురవుతోంది. మార్కెట్‌ యార్డుల్లోకి పంటను విక్రయించడానికి వెళ్లాక ధరలేక కుదేలవుతున్నారు. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం కేవలం 20 శాతం కందులను కొని చేతులు దులిపేసుకుంటోంది. తీరా మార్కెట్లో అమ్ముకుందామంటే అకాల వర్షం నిండా ముంచేసింది. అకాల వర్షం జిల్లా వ్యాప్తంగా రైతులను నిండా ముంచింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల ఫలితంగా మిర్చి భారీగా దెబ్బతింది. ఇక మక్కజోన్న పంట క్షేత్రాల్లోనే నేల వాలిపోయింది. ఇక పసుపు పంట ఉడికించిన తడి ఆరకుండానే మళ్లీ తడిచింది. జిల్లాలోని పలు చోట్ల ధాన్యం కూడా తడిసి ముద్దయింది.అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పరకాల, నర్సంపేట ప్రాంతాల్లో అధిక శాతం వర్షాపాతం నమోదైంది. జిల్లాలోని ఈరెండు ప్రాంతాల్లోనే రైతులు అతి ఖరీదైన మిరుపంటను పండిస్తారు. అదికాస్తా ఇప్పుడు తడిసి ముద్దవటంతో రైతులు కళ్లాల వద్దే కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతులు చేతికొచ్చిన మిర్చి పంటను కల్లాల్లో ఆరబోసారు. తడిసిన కుప్పలు కూడా తడిసి ముద్దయి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో వారంలో మిర్చిని మార్కెట్‌కు తరలించి అమ్ముకుందా మనుకుంటే అకాల వర్షం నష్టాన్ని మిగిల్చిందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట సైతం ఈదురుగాలులకు నేలకొరిగి నష్టాన్ని మిగిల్చింది. మరో పక్షం రోజులైతే కంకి చేతికి వచ్చే సమయం కావడంతో ఈ వానకు పంట చేతికి రాకుండా పోయింది. పత్తి ఏరిద్దామంటే ఎన్నికల వల్ల కూలీలు దొరక్క రైతులు కొంచెం వెనకాముందాడారు. అకాల వర్షంతో పంట క్షేత్రాల్లో చెట్ల విూదనే పత్తి వర్షానికి ధారలా కారి పూర్తిగా చేతికి రాకుండా పోవడంతో పత్తి రైతులు కూడా నష్టపోయారు.