కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన పంటను అధికారులు పట్టుకున్నారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఆ సారి పంట కొనుగోళ్లలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులు ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ విధానంతో దళారుల దందాకు అడ్డుకట్ట పడింది.వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పంట సాగుచేసిన రైతుల వివరాలను సేకరించారు.ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంటను సాగు చేశాడు? పంట దిగుబడి ఎంత వచ్చిందనే వివరాలు తీసుకున్నారు. మార్కెట్‌యార్డులకు రైతుల పంటను విక్రయానికి తీసుకొచ్చినప్పుడు తమ వద్ద ఉన్న వివరాలను వారి పరిశీలించి నిర్దారణ చేసుకున్న తర్వాత కొనుగోలు చేస్తున్నారు. గతంలో దళారులు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కందులను తక్కువ ధరకు తీసుకొచ్చి రైతుల పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే వారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వచ్చేది. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డుతో పాటు జైనథ్‌, ఇచ్చోడ, బోథ్‌, బేల సబ్‌మార్కెట్‌యార్డు, తాంసి మార్కెట్‌యార్డు, ఉట్నూర్‌ సబ్‌మార్కెట్‌యార్డు, ఇంద్రవెల్లి మార్కెట్‌యార్డు, నార్నూర్‌ సబ్‌ మార్కెట్‌యార్డుల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల కిందట కందుల కొనుగోళ్లుప్రారంభంకాగా.. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఇప్పటి వరకు 31,571 క్వింటాళ్ల సేకరించారు. జిల్లాలో రైతులకు పంటల విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఎక్కువగా ఎక్కువగా పత్తి, కంది, సోయాబీన్‌ పంటలను సాగవుతుండగా.. రైతులు నష్టపోకుండా వారికి కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సర్కారు పంటలను కొనుగోలు చేస్తున్నది. హాకా ద్వారా సోయాబీన్‌ కొనుగోళ్లు పూర్తికాగా.. 15 రోజుల నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాల కారణంగా పంట దిగుబడులు కొంత తగ్గాయి. ఈ పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర
రూ.5675 ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పంట సేకరణ జరుగుతోంది. ఆయా మార్కెట్‌యార్డు పరిధిలోని మండలాల్లోని గ్రామాల రైతులకు ఏ రోజున మార్కెట్‌యార్డుకు తమ పంటను తీసుకురావాలనే విషయాన్ని మందుగా తెలియజేస్తున్నారు. తమకు సూచించిన రోజున రైతులు మా ర్కెట్‌యార్డుకు కంది పంటను తీసుకుపోయి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కంది క్వింటాలుకు రూ.5300 ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థలు కనీస మద్దతు ధర రూ.5675 కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నాయి.