‘కంప్యూటర్లపై నిఘా’ అంశాన్ని పరిశీలిస్తాం

– కేంద్రానికి నోటీసులు జారీచేసిన న్యాయస్థానం
– ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి15(జ‌నంసాక్షి) : కంప్యూటర్‌ వ్యవస్థలోని డేటాను పరిశీలించేందుకు వీలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా పది కేంద్ర సంస్థలకు అనుమతిస్తూ కేంద్ర ¬ం శాఖ గతేడాది డిసెంబరు 20న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ విషయంపై కేంద్రానికి నోటీసులు జారీచేసింది. దీనిపై ఆరు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. స్మార్ట్‌ఫోన్‌ నుంచి డేటా నిల్వ చేసే ఏ సాధనాన్నయినా తమ అధీనంలోకి తీసుకుని పరిశీలించే అవకాశాన్ని కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. కంప్యూటర్‌ వ్యవస్థలోని ఎలాంటి డేటానైనా ఇంటర్‌సెప్ట్‌ చేసేందుకు, పర్యవేక్షించేందుకు, డీక్రిప్ట్‌ చేసేందుకు సదరు కేంద్ర సంస్థలకు వీలు కలుగుతుంది. అయితే ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ చర్య ప్రభుత్వ చర్య వ్యక్తిగత గోప్యతహక్కుకు భంగం కలిగించడమేనని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై న్యాయస్థానం పైవిధంగాస్పందించింది.