కడపలో డిజిపి పర్యటన

శాంతిభద్రతలపై సవిూక్ష

కడప,జూన్‌19(జ‌నం సాక్షి ): కడప జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని డీజీపీ మాలకొండయ్య పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీ ముందుగా అతిథి గృహంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత డీపీవో కార్యాలయంలోజిల్లాలోని డీఎస్పీలు, ఓఎస్డీలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిస్థితిని, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ బాబూజీ అట్టా వివరించారు. కడప నగరంలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేశ్‌ రేపటి నుంచి నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు. పోలీసు సబ్‌ డివిజన్ల వారీగా నేరాల పరిస్థితి, కేసుల వివరాలను ఆరా తీశారు. కేసులు నమోదు చేయడమే కాకుండా నేరస్థులకు శిక్షలు పడే విధంగా కూడా పోలీసు అధికారులు చొరవ చూపాలన్నారు. డీజీపీ మధ్యాహ్నం కడప నుంచి బయలుదేరి అనంతపురం వెళ్లనున్నారు.

నేటినుంచి సిఎం రమేశ్‌ దీక్ష

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ రేపు నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఆయన దీక్షకు దిగుతున్న సందర్భంగా భారీ టెంట్లు వేస్తున్నారు. దాదాపు పది వేల మంది కూర్చునే విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వారందరికీ ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు సీఎం రమేష్‌ తో పాటు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చునే వీలున్నందున నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాలని ప్రణాళిక రచిస్తున్నారు. సీఎం రమేష్‌ కడపలోనే ఉండి ఏర్పాట్లను సవిూక్షిస్తున్నారు. రోజుకో నియోజకవర్గం నుంచి కార్యకర్తలు దీక్షా శిబిరానికి తరలివచ్చే విధంగా ప్రణాళిక వేసుకున్నారు.