కన్నడనాట విక‌సించిన‌ క‌మ‌లం

– మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు
– ఫలితాలిచ్చిన మోడీ, అమిత్‌షా త్రయ వ్యూహాలు
– బెడిసికొట్టిన కాంగ్రెస్‌ నేతల వ్యూహాలు
– ఢీలాపడ్డ కాంగ్రెస్‌ శ్రేణులు
– లింగాయత్‌ కోటలోనూ బీజేపీ పాగా
– ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తలకిందులు
– దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు
– దక్షిణాది మాదే అంటూ నినాదాలు 
– కన్నడనాట విజయంతో బీజేపీ ఖాతాలో 22వ రాష్ట్రం
బెంగళూరు,మే15(జ‌నం సాక్షి): అందరి అంచనాలు తలకిందులయ్యాయి.. ఎగ్జిట్‌ ఫోల్స్‌ ఫలితాలు తారుమారయ్యాయి.. కన్నడనాట హంగ్‌ వస్తుందని భావించిన వారికి అక్కడ ప్రజలు ఊహించని షాక్‌ను ఇచ్చి బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.. కన్నడ కంఠసీమలో కమలహారాన్ని వేసారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన రెండుమూడు స్థానాల మినహా మిగిలిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో యడ్యూరప్ప సీఎం పీఠాన్ని అదిష్టించడానికి మార్గం సుగమమైంది.. కన్నడనాట  ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించటంతో దక్షిణాదిన బీజేపీ ఘనంగా కాలుమోపినట్లయింది. 12న జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్‌ జరగ్గా మంగళవారం కౌంటింగ్‌ మొదలయ్యింది. తొలిదశ ఫలితాల ఆధారంగా చూస్తే  మొత్తంగా కర్నాటకలో అధికారపీఠం బిజెపిదే కానుంది. ఎన్నికల ఫలితాలు ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి.. మొత్తం 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ప్రారంభం నుంచి గంటపాటు కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. ఒకానొక దశలో బీజేపీ పూర్తిగా వెనుకబడిపోవటంతో పాటు మరోవైపు జేడీఎస్‌ అధిక్యంలో కొనసాగింది. దీంతో కర్ణాటకలో ఈ దఫా అందరూ హంగ్‌ వస్తుందని భావించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలుసైతం జేడీఎస్‌ నేతలతో భేటీ అయ్యి పాలకవర్గం ఏర్పాటుకోసం సహకారం అందించాలని చర్చలుసైతం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే బీజేపీ ఊహించని రీతిలో దూసుకెళ్లి మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ చీఫ్‌ అమిత్‌షా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను బెంగుళూరు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ తరుణంలో బీజేపీ ఊహించిన దానికంటే ఎగ్జిట్‌ ఫోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువవుతూ దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇక ఎవరితో సంప్రదింపులు లేకుండా అధికారాన్ని చేపట్టే దిశగా బీజేపీ అభ్యర్థులు గెలుపు దిశగా పయనించారు.
ఫలించిన అమిత్‌షా, మోడీ త్రయం వ్యూహాలు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు తమ సత్తాను చాటుకున్నారు. ఊహించని దానికంటే మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి అధికారం చేపట్టేందుకు మార్గం దాదాపు సుగమం చేసుకున్నారు. ముఖ్యంగా నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారం జరగగా ప్రధాని మోదీ, అమిత్‌సాలు ఒకవైపు, యడ్యూరప్ప టీం ఒకవైపు విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి
నుంచి మోది, అమిత్‌షాలూ పకడ్భందీ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ, సిద్ధిరామయ్యలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారంలో
దూసుకెళ్లారు. ముఖ్యంగా మోడీ పలు బహిరంగ సభల్లో రాహుల్‌, సోనియాలపై చేసిన విమర్శల దాడి వివాదాలకుసైతం దారితీసింది. ఆ స్థాయిలో మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాడు. మరోవైపు కన్నడ సీఎం సిద్ధిరామయ్యపై అవినీతి ఆరోపణలు చేస్తూ మోడీ, అమిత్‌షాలు మాటలదాడి చేశారు. అమిత్‌షా, మోడీల మాటల దాడిని సిద్ధిరామయ్య సమర్థవంతంగా తిప్పికొట్టారు. అమిత్‌షా, మోడీ త్రయం ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ నియోజకవర్గాల వారీగా వాటి అమల్లోకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో ఎవ్వరూ ఊహించని స్థాయిలో బీజేపీ కన్నడనాట పాగా వేసింది.
దెబ్బతీసిన అతివిశ్వాసం..
మరోవైపు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కర్ణాటకలో విజయం సాధిస్తుందని అందరూ భావించారు. ఆమేరకు ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, రాహుల్‌ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. మోడీ లక్ష్యంగా వాగ్భానాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. మరోవైపు సిద్ధిరామయ్య ట్వీట్ల వేదికగా మోడీ, కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పపై, గాలి జనార్దన్‌ రెడ్డి అనుచర వర్గంపై అవినీతి ఆరోపణలతో టార్గెట్‌ చేస్తూ విస్తృతం ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయారు. కన్నడ ప్రచారంలో రాహుల్‌ గాంధీలో గతకంటే కొంత ఉత్సాహాన్ని నింపగలిగినా ఓటింగ్‌కు వచ్చే సరికి కన్నడ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. మరోవైపు ఎన్నికలకు ముందు లింగాయత్‌లను ప్రత్యేకమైన మతస్థులుగా గుర్తించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తుది ఆమోదం కోసం కేంద్రానికి తీర్మానాన్ని పంపింది. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు అనుకూలించలేదు. వీరశైవులు, ఇతర హిందూ వర్గీయులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు.
బీజేపీ ఖాతాలో 22వ రాష్ట్రం..
కర్ణాటకలో బీజేపీ పాగా వేయడంతో 22వ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు జరిగిన 222 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 112 స్ధానాల్లో విస్పష్ట ఆధిక్యం కనబరచడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌కు చేరువైంది. తొలుత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ¬రా¬రీగా పోరాడినా కాంగ్రెస్‌ కేవలం 68 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరచగా, జేడీఎస్‌ 40 స్ధానాలకే పరిమితమైంది. కాగా కర్ణాటకలో పార్టీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు ఫోన్‌ చేశారు. పార్టీ విజయంపై ఈ సందర్భంగా వారు ఇరువురూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు..
కన్నడనాట బీజేపీ పాగా వేయడంతో దేశవ్యాప్తంగా మంగళవారం సంబరాలు మిన్నంటాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు, నేతలు మిఠాలు తినిపించుకుంటూ, బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నాయి. మరోవైపు కన్నడనాట బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. తొలుత పలితాల్లో బీజేపీ అభ్యర్థులు కొంత వెనుకడినట్లు కనిపించినా.. కొద్దిసేపటికే అనూహ్యంగా పుంజుకొని మెజార్టీ దిశగా బీజేపీ పయనించింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి
సంబరాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మరో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు స్వీట్లు
తినిపించి బీజేపీ విజయం పట్ల సంతోషం వెలుబుచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకొని స్వీట్లు తినిపించుకున్నారు. దక్షిణాదిన బీజేపీ హవా ప్రారంభమైందని.. వచ్చే ఏడాది జరిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని పార్టీ నేతలు దీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తలకిందులు
కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఏ పార్టీకి మెజారిటీ రాదని.. హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ కుండబద్దలు కొట్టగా.. ఆ అంచనాలను కన్నడ ఓటర్లు తిప్పికొట్టారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరిస్తూ… భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్న అంచనాలను తిరగరాస్తూ భాజపా.. మ్యాజిక్‌ ఫిగర్‌ 113కి కాస్త అటుఇటుగా సీట్లు దక్కించుకునే దిశగా పయనిస్తోంది. 24 నియోజకవర్గాలున్న కర్ణాటకలో ఈ నెల 12న 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 113 సీట్లు దక్కించుకోవాలి. అయితే ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేయడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు 30-40 స్థానాలు దక్కుతాయని సర్వేలు చెప్పడంతో ఆ పార్టీ ‘కింగ్‌ మేకర్‌’ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఓటర్ల తీర్పు మాత్రం వేరేలా ఉంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే భాజపా 107 స్థానాలు గెలుచుకునేలా కనిపిస్తోంది. తక్కువ స్థానాలు వచ్చినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్‌ ఆశలపై కన్నడ ప్రజలు నీళ్లు జల్లారు. మరోవైపు కాంగ్రెస్‌, భాజపాలో ఎవరు అడిగితే వారికి మద్దతు ప్రకటించింది అధికారాన్ని పంచుకోవాలనుకున్న జేడీఎస్‌కు చుక్కెదురైంది. భాజపా మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువగా స్థానాలు సాధించేలా కనిపించడంతో ఒంటరిగానే అధికారం చేపట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. కేంద్రమంత్రి సదానంద గౌడ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కర్ణాటకలో పొత్తు ప్రసక్తే లేదని.. భాజపా ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు.