కరవు నేపథ్యంలో ప్రత్యామ్నాయ పనులపై దృష్టి

ఒంగోలు,మార్చి18(జ‌నంసాక్షి):  గ్రామాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరుల గుర్తింపు, అక్కడ నుంచి సరఫరా, ట్యాంకర్ల ద్వారా సరఫరా, బోర్లను లోతు చేయడం, చెరువులను నింపేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. వీటికి అధికారులు నిధులు  విడుదల చేశారు. వాటితో అయినా సక్రమంగా నీటి సరఫరా జరుగుతున్న పరిస్థితులు లేవు. చిన్నచిన్న సమస్యలతో మూలనపడిన వాటిని కూడా పట్టించుకోలేనంత తీరిక లేని పనుల్లో గ్రావిూణ
నీటిసరఫరా విభాగం నిద్రిస్తోంది. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  పశ్చిమప్రాంతంలో వలసల ప్రభావం అధికంగా ఉంది. వంద రోజులకు అదనంగా  150 రోజుల పనిదినాలు పెంచారు. అయితే పనులే ముందుకు సాగడం లేదు. రోజుకు 2 లక్షల మంది పనులకు రావాల్సి ఉండగా ఇప్పుడు నిత్యం 83 వేల మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయ పనులున్నాయని చెబుతున్నా.. పంటలే లేకుంటే వాటికి పోయేదెక్కడ అనే ప్రశ్న కూలీల నుంచి వస్తోంది. పశ్చిమ ప్రాంతంలో పనులు లేక 25 వేల కుటుంబాల వరకు వలస బాట పట్టాయని అంచనా. పంచాయతీల్లో పనులు కల్పించకపోవడం వల్లే ఊరొదిలి పోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అక్కడి అధికారులు మాత్రం వారికి ఉపశమనం కల్పించడం లేదు. మరోవైపు జిల్లాలోని 56 మండలాలనూ కరవు జాబితాలోకి చేర్చారు. ఇప్పటికే ప్రకటించిన మండలాల్లో డిసెంబరు నుంచి ఆసరా దొరుకుతుందని ఎదురు చూస్తుంటే అడుగులే పడలేదు.రైతులు, ప్లలె ప్రజలు, పట్టణాల్లో అవస్థలపై ప్రభుత్వానికి నివేదికలు పంపి అదనపు నిధులు వచ్చేలా చేయాల్సి ఉంది.  తాగునీటి సరఫరా, వలసల నివారణకు ఉపాధి హావిూ కింద అదనపు పనిదినాలు, పంటలకు పండ్లతోటలకు జరిగిన నష్టాన్ని గుర్తించి పెట్టుబడి రాయితీకి సిఫార్సు, పశువులకు మేత, నీరు.. ఇలా ఎన్నో విధాల ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునే వీలుంది. పాల దిగుబడి తగ్గి గేదెలను కబేళాలకు తరలిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. పనుల్లేక వలస వెళ్లే వారి లెక్కలూ మండల అధికారులకు, సిబ్బందికి తెలియనిదేం కాదు. అయినా కలెక్టర్‌ దృష్టికి సమస్య వచ్చినప్పుడో, ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రానికి వచ్చి వినతిపత్రం ఇచ్చినప్పుడో వాటిపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. తర్వాత వాటిని వదిలేస్తున్న వైనం కిందిస్థాయిలో పెరుగుతున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జిల్లా మొత్తాన్ని కరవుగా ప్రకటించిన నేపథ్యంలో అయినా జిల్లాస్థాయి అధికారులు శాఖల వారీగా కార్యాచరణ నిర్దేశిరచి క్షేత్రస్థాయికి నడిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందది.