కరీంనగర్‌ లోక్‌సభపై కమలం దృష్టి 

కేంద్ర పథకాలే ప్రచారంగా ముందుకు
కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాలో భాజపాకు మంచి పట్టు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ భారీగా ఓట్లను రాబట్టారు. అదే ఉత్సాహంతో కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంను ఓటర్ల సహకారంతో దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇక్కడ బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.  కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్‌ కూడా పోటీకి సిద్దంగా ఉన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో సమిష్టి కృషితో కరీంనగర్‌ భాజపా అభ్యర్థిని గెలుపించు కోవాలని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా మళ్లీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా  భాజపా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.ధర్మారావుముఖ్య అతిథిగా వచ్చి కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు. కొత్తగా ప్రవేశపెట్టిన కిసాన్‌ యోజన  పథకం ప్రతి రైతులు వినియోగించుకునేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అవినీతిరహిత పాలన భాజపా ద్వారానే సాధ్యమైందన్నారు. సంస్థాగత నిర్మాణంలోని లోపాలను సవరించుకొని కార్యకర్తలను పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఎరువుల కార్మాగారం ఏర్పాటు ప్రధాని మోదీతోనే సాధ్యమైందన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటీ ¬దా కల్పించి రూ.100 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఈ అంశాల ఆధారంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని
నిర్ణయించారు. ఇదిలావుంటే కరీంనగర్‌లో ఈ దఫా విజయం సాధిస్తామని పార్టీ ప్రతినిది బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.