కర్ణాటక గవర్నర్‌ కేంద్రం ఏజెంట్‌గా వ్యవహరించారు

– కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కాలం గడుపుతున్నాడు
– రైతుబంధుతో రైతులకు దక్కేది అల్ప సంతోషమే
– రైతుబంధులో గిరిజనులకు అన్యాయం జరిగితే పోరాటంచేస్తాం
– విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి
ఖమ్మం, మే19( జ‌నం సాక్షి ) : కర్ణాటకలో గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, కర్ణాటక పరిణామాలకు ఒక గుణపాఠం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్‌ భవన్‌లో ఆయన శనివారం విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెజార్టీ లేకపోయినా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం వెనుక రహస్య ఎజెండా ఉందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఒక గుణపాఠం కావాలన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కాలం గడుపుతున్నారని చాడా మండిపడ్డారు. కర్ణాటకలో ఇంత జరుగుతున్నా కేసీఆర్‌ మాట్లాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని, బీజేపీ భావ స్వేచ్ఛను హరిస్తుందని చాడా వెంకటరెడ్డి తూర్పారబట్టారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీనే నెగ్గాలనే పంతంతో బీజేపీ పోతుందని , ఇది ఆ పార్టీ పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్‌ రైతుబంధు పథకం ద్వారా రైతుకు దక్కేది అల్ప సంతోషమేనని, వీరితో పాటు పోడు సాగుదారులకు కూడా రైతు బంధు పథకం అమలు చేయాలని సూచించారు. ఈ పథకంలో గిరిజనులకు న్యాయం జరగాలని, న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను, అలాగే మార్కెట్‌ లో తడిసిన ధాన్యం కోనుగోలు చేసి, రైతులను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు తీసుకురావాలన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను ఆవిష్కరించిన స్వామినాథన్‌ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ నెలాఖరులో వాటి కార్యాచరణకై ఉద్యమబాట పడతామన్నారు. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ గణనీయమైన స్థానాల్లో పోటీచేస్తుందని భవిష్యత్‌ కార్యా చరణను వెల్లడించారు.
——————————