కర్నాటకనూ వదలని వరదలు

కొడగులో వరదలకు ఆరుగురు మృతి: సిఎం కుమారస్వామి

బెంగళూరు,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కర్నాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొడగులో ఆరుగురు చనిపోయారని ఆ రాష్ట్ర సిఎం కుమారస్వామి తెలిపారు. 11 వేలకు పైగా ఇళ్లు కూలిపోయినట్టు ఆయన వెల్లడించారు. రోడ్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రోడ్ల జాబిఆను తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు సైతం కొడగులో సహాయక చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద తీవ్రతకు కొడగు జిల్లాలో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరదతో ఏర్పడిన దీపాల్లో ఆరు వందలకు పైగా ప్రజలు చిక్కుకు పోయారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. వారిని రక్షించేందుకు మర పడవలు, ఆహార పదార్థాలు, ఔషధాలను తీసుకువెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం వరకు విఫలయత్నాలు సాగాయి. శనివారం ఉదయం వేళకు బాధితులను రక్షించేందుకు రక్షణ శాఖ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. కొడగు జిల్లా వ్యాప్తంగా ఆయా నిర్వాసిత కేంద్రాల్లో రెండు వేల మంది ప్రజలు ఉన్నారు. వారికి ఔషధాలు, ఆహారాన్ని వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామి అధికారులను ఆదేశించారు. నేత్రావతి, కుమారధార, ఫల్గుణి, పయశ్విని నదుల్లో ప్రవాహం ఎక్కువైంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. శనివారం మధ్యాహ్నంలోగా కొడగుకు వంద బోట్లను చేర్చుతామని జిల్లా వ్యవహారాల బాధ్యుడు సా.రా.మహేశ్‌ తెలిపారు. కొడగు జిల్లాకు పర్యాటకులెవరూ రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మైసూరు, మంగళూరు మార్గాల నుంచి కొడగుకు వెళ్లే అన్ని దారులూ మూసుకుపోయాయి. ఘాట్‌ రోడ్లలో ప్రవాహం ఎక్కువైంది. కొండచరియలు విరిగి పడడం, చెట్లు అడ్డుగా పడడంతో రహదారుల రూపు రేఖలు ధ్వంసమయ్యాయి. మడికేరిలోని ¬ం స్టేలకే పర్యాటకులు పరిమితమయ్యారు. కొండవాలుల్లో నిర్మించుకున్న ఇళ్లు కూలిపోవడం, దిగువ ప్రాంతాల్లో ఇళ్లలోని నీరు ప్రవహించడంతో ఎక్కడివారక్కడే ఉండిపోవలసి వచ్చింది. విద్యుత్తు పూర్తిగా నిలిచి పోయింది. సూర్యరశ్మి లేకపోవడంతో సౌరశక్తి ఫలకాలు పని చేయడం లేదు. మైసూరు-ఊటీ మార్గం, మైసూరు-మడికేరి మార్గం, చామరాజనగరలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.