కలప స్మగ్లింగ్‌పై ఉదాసీనత?

కోట్ల విలువైన కలప మాయం

నిర్మల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): అడవుల ఖిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్రమేణా అడవులు అంతరించి పోయి భవిష్యత్తు వర్గాలకు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజు టేకు కలప తరలిపోతోంది. స్మగ్లర్లను పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు అడ్డుకోలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. కోట్ల విలువైన టేకు కలప ప్రతి సంవత్సరం తరలిపోతుంటే కేవలం నామ మాత్రంగా కొన్ని వాహనాలను పట్టుకుని చూపడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా నలుమూలలా వ్యాపించి ఉన్న అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం గుండా వెళుతున్నాయి. జిల్లాలోని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ప్రాంతాల్లో అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటే అక్రమ రవాణ అడ్డుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. స్మగ్లర్లు విలువైన కలప తరలిస్తుంటే కనీసం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా అటవీ ప్రాంతాల నుంచి విలువైన టేకు కలప తరలిపోకుండా అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలావుంటే కలప అక్రమ స్మగ్లింగ్‌పై అటవీ అధికారులు దృష్టి సారించారు. ఆకులు రాలే కాలం రానుండడంతో అడవుల్లో కలప స్మగ్లింగ్‌ను గుర్తించే పనిలో పడ్డారు. చెట్లను నరికివేసిన ప్రాంతాలు, పిల్లదారులతో పాటు స్మగ్లింగ్‌ నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుంటున్నారు. స్మగ్లింగ్‌ గురించి వీరు స్థానిక అటవీ అధికారులతో చర్చించారు. కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ అటవీ ప్రాంతంలో ప్రధానంగా జంతువుల వేట, అడవుల నరికివేత తదితర అంశాల గురించి వివరించారు. సిరిచెల్మ అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్‌ అవుతున్న గ్రామాలనుపరిశీలించారు. అడవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షేత్రస్థాయి

సిబ్బందికి తెలియజేశారు. అటవీ జంతువుల గురించి తెలిపారు.