కలాంకు కన్నీటి సలాం..

C

– విలపించిన దేశం

– కన్నఊరి ఒడిలోకి ముద్దుబిడ్డ కలాం

– ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో అంతిమ వీడ్కోలు

– సైనిక లాంచనాలతో అంత్యక్రియలు

రామేశ్వరం,జులై30(జనంసాక్షి): రామేశ్వరం నుంచి మొదలైన ఓ మహాత్ముడి ప్రయాణం తిరిగి అక్కడికే చేరుకుంది. ఆ మహాత్ముడు ఇక అక్కడే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తన విజ్ఞాన భాండాగారాన్ని మనకు వదిలి ఊర్థ్వ లోకాలకు తరలి వెళ్లారు. తన విజ్ఞాన సర్వస్వంతో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచి, భారత ఖ్యాంతిని ఖండాంతరాలకు వ్యాపంపి చేసిన క్షిపణి పితామహుడు,  ప్రజా రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం సైనిక లాంఛనాల మధ్య ఆయన స్వగ్రామం రామేశ్వరంలో పూర్తి అయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్‌ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. మస్లిం మత పెద్దలు ఆయన పార్థివదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మత సంప్రదాయాల ప్రకారం పార్ధివదేహాన్ని ఖననం చేశారు. అంతకు ముందు త్రివిధ దళాలు సైనిక వందనం సమర్పించాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు , ప్రముఖుల అవ్రు నయనాల మధ్య కలాం అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో కలాం ప్రస్థానం ముగిసింది.  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, మంత్రులు, కేంద్రమంత్రులు మనోహర్‌ పారికర్‌, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్‌చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, గులాంనబీ ఆజాద్‌, టీడీపీ ఎంపీ సీఎంరమేష్‌, శాస్త్రవేత్తలు, కోలీవుడ్‌ ప్రముఖులు తదితరులు అంతిమ సంస్కారానికి హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, ప్రజలు అశ్రునయనాలతో కలాంకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రామేశ్వరంలోని స్వగృహం నుంచి భారీ జనసందోహం మధ్య కలాం అంతిమయాత్ర నిర్వహించారు.

రామేశ్వరంలో 1.32 ఎకరాల్లో కలాం స్మారకమందిరం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం స్మారక మందిరాన్ని రామేశ్వరంలో 1.32 ఎకరాలలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత గాంధీ సమాధి పక్కన దీన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కుటుంబసభ్యులు మాత్రం రామేశ్వరంలోనే నిర్మించాలని కోరారు. ఆ మేరకు తగిన స్థలాన్ని పరిశీలించాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు రావడంతో పేక్కరుంబులో ప్రభుత్వానికి చెందిన 1.32 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. రామేశ్వరం బస్‌స్టాండు నుంచి రెండు కిలోవిూటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.  దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా, ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతి గడించిన తమవాడిని చూసేందుకు రామేశ్వరం కదిలి వచ్చింది. తమిళనాడు దండులా వచ్చింది.  కలాంను కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్ద ప్రజలు బారులు తీరారు. అశ్రునయనాలతో కలాంకు నివాళులర్పించారు. కలాంను కడసారి చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది రామేశ్వరం చేరుకున్నారు. ఉదయం  అబ్దుల్‌ కలాం అంతియయాత్ర అశ్రునయనాల మధ్య రామేశ్వరంలో ప్రారంభమైంది. కలాం పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి అంత్యక్రియలు నిర్వహించే  కురు మంటపం వద్దకు తరలించారు. కలాంను కడసారి చూసేందుకు దాని పొడవునా ప్రజలు భారీగా బారులు తీరి కన్నీటితో వీడ్కోలు పలికారు.  బంధువులు, మిత్రులు, రామేశ్వరం ప్రజలు కలాంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ దుఖఃసాగరంలో మునిగి పోయారు.  ప్రధానమంత్రి మోదీ నేరుగా అంత్యక్రియలు జరిగే ప్రాంతానికే  చేరుకుని భౌతిక కాయం వద్ద పుస్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.  దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్న ఆయన… అక్కడి నుంచి రామేశ్వరం చేరుకునున్నారు. కలాం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రామేశ్వరం చేరుకున్నారు. ఆయనతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు రామేశ్వరం చేరుకున్నారు.  కలాం అంతిమ సంస్కారాలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు హాజరు కావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కలాం పార్ధివదేహానికి ప్రముఖలంతా చివరిసారి ఘనంగా నివాళులర్పించారు. ఖనన  కార్యక్రమం పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దలు ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

కలాంకు గౌరవంగా సభలు వాయిదా

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గౌరవార్ధం లోక్‌సభ శుక్రవారానికి  వాయిదా పడింది.  రెండురోజుల విరామం అనంతరం  ప్రారంభమైన సభలో కలాం మృతికి సభ్యులంతా సంతాపం ప్రకటించించారు. అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కలాం అంత్యక్రియలు జరుగుతన్న వేళ ఆయనకు గౌరవసూచకంగా సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పలువురు సభ్యుల మృతికి కూడా సంతాపం ప్రకటించారు. గురుదాస్‌ పూర్‌ మృతులకు కూడా సభ సంతాపం ప్రకటించింది. కలాం అంతిమ సంస్కారం సందర్భంగా రాజ్యసభ సంతాపం తెలుపుతూ మధ్యాహ్నం 2 గంటలకు వరకు వాయిదా పడింది. అనంతరం గురుదాస్‌పూర్‌ ఘటనపై ¬ంమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. సభ్యుల నిరసనల మధ్య సభశుక్రవారానికి వాయిదా పడింది.

కలాం అంత్యక్రియలకు అశేషజనవాహిని హాజరు

ప్రజల రాష్ట్రపతిగా పేరొందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంత్యక్రియలకు భారీగా జనం తరలి వచ్చారు.  తమిళనాడులోని రామేశ్వరంలో సైనిక లాంఛనాలతో  అంత్యక్రియలు జరగగా ఈ అంత్యక్రియల కార్యక్రమానికి లక్షకుపైగా ప్రజలు హాజరవడం విశేషం. అశ్రునయనాలతో వారంతా ఆయనకు నివాళులర్పించారు. తండోపతండాలుగా తరలివచ్చిన జనం క్షపణి పితామహుడికి నివాళి అర్పించారు. ప్రజలు భారీగా రానున్నారని ముందుగానే గమనించి భారీగా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆయన పార్థివదేహం వద్ద మత పెద్దలు ప్రత్యేక పార్థనలు చేసి.. సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. అంతకు ముందు కలాం నివాసం నుంచి అంత్యక్రియలు చేపట్టిన ప్రాంతం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. దీనికి కూడా ప్రజలు వెంటనడిచారు.