కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌

వారిని రైతులు దగ్గరకు రానీయరు
రైతు సంక్షేమంతో మారుతున్న తెలంగాణ: చారి
ఆదిలాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్నాయని మాజీ ఎంపి, ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణగోపాలాచారి అన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న రైతు బీమా పథకంతో కాంగ్రెస్‌ ఇక పూర్తిగా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఒకవేళ ఎవరైనా కాంగ్రెస వారు రైతుల జోలికి వెళ్ళినా దగ్గరకు రానీయరని అన్నారు.  రైతుబంధు పథకంతో గ్రామాల్లో ఉత్సాహ వాతావరణం కనిపిస్తోందని, రైతుల్లో ఆనందం తొణికిస లాడుతోందని ఆయన శుక్రవారం నాడిక్కడ తనను కలిసిన విలేకర్లతో అన్నారు. రైతుబంధు గొప్ప కార్యక్రమని, ఈ పథకంతో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతేనని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని, రైతులకు జూన్‌ 2 నుంచి ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు సిఎం కెసిఆర్‌  ఎల్‌ఐసీతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఇలాంటి పూథకాలను నిజంగా కేంద్రం అమలు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు మేలు జరగగలదన్నారు. తెలంగాణ వచ్చక గోదావరి నీటితో ప్రతీ ప్లలె పచ్చగా పంటలతో కళకళలాడుతోందన్నారు గతంలో  రైతులు రాత్రిపూట కరంట్‌ వల్ల పలు ప్రమాదాలు ఎదుర్కొన్నారని,రైతులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని, ఇప్పుడు 24గంటల కరంట్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కొందరు రైతులు 24గంటల కరంట్‌ వద్దని, 12 గంటలు చాలని కోరుతున్నారని తెలిపారు. కెసిఆర్‌  ప్రభుత్వంలో రైతులను ఆత్మబంధువుగా చూస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఆదర్శ రైతుల పేరిట దోచుకున్నారని, ఈ ప్రభుత్వంలో రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రతీ రైతులకు చెక్కులు అందిస్తోందన్నారు. సాగుభూమికే కాకుండా రాళ్లు రప్పలు ఉన్న భూములకు పంట పెట్టుబడి ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. రైతులకు ఇప్పుడు రూ.6వేల కోట్లు పెట్టుబడి సాయం అందిస్తే, వచ్చే ఎడాదికి రూ.6వేల కోట్లు పెట్టుబడికి సిద్ధం చేస్తునట్లు తెలిపారు. వానకాలంలో ప్రతి గ్రామంలోని చెరువుల్లో గోదావరి నీరు నింపుకుంటామన్నారు.