కాంగ్రెస్‌తో పొత్తు టిడిపికి లాభించేనా?

కెసిఆర్‌ ఓటమే లక్ష్యంగా తెలంగాణలో రాజకీయాలు

మహాకూటమికి కమ్యూనిస్టులు కలసి వచ్చేనా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలసి టిడిపి ముఖాముఖి తలపడనున్నట్లు ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా కెసిఆర్‌ను ఢీకొనాలని టిడిపి భావిస్తోంది. ప్రకటన అన్నది లేకున్నా లోపాయకారిగా ఈ రెండు పార్టీల మద్య అవగాహన కుదిరింది. గత ఎన్నికల్లోగ గెల్చిన సీట్లు, ఓటుశాతం ఆధారంగా టిడిపి టిక్కెట్లను కోరబోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌, తెలుగుదేశంపార్టీల కలయిక వల్ల ఒకరు కత్తులు దూసుకోబోతు న్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న ఆయన ప్రత్యర్థులు, పొత్తుల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహా కూటమి ఆలోచన తెరపైకి వచ్చింది. కూటమి ఏర్పాటులో భాగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే టిఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థి దొరికినట్లే. కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాకూడదని చంద్రబాబు బలంగా కోరుకుం టున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ కూడదని కేసీఆర్‌ వాంఛిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సహకరించినందుకు బీజేపీ సిట్టింగ్‌ శాసనసభ్యులపై బలహీనమైన అభ్యర్థులను, అదే సమయంలో మజ్లిస్‌ పార్టీ నొచ్చుకోకుండా ఆ పార్టీ అభ్యర్థులపై కూడా హిందూ అభ్యర్థులను పోటీ పెట్టడం ద్వారా రెండు

పార్టీలనూ కేసీఆర్‌ తన బుట్టలో వేసుకున్నారన్న అభిప్రాయం ఉంది. జాతీయ రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఇద్దరు చంద్రులు రాజకీయంగా చెరోదారి ఎంచుకున్నారు. గత ఎన్నికలలో మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేసిన తెలుగుదేశం, బీజేపీ ఇప్పుడు బద్ధశత్రువులుగా నిలబడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి కనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌పైనే ప్రధానంగా గురిపెట్టారు.న జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు ఎపిలో అధికార తెలుగుదేశంపార్టీకి ప్రధాన ప్రత్యర్థులు కాదు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నం. కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాకూడదన్నది చంద్రబాబు ఆకాంక్ష. కాంగ్రెస్‌ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడకూడదని కేసీఆర్‌ వాంఛిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తువైపు తెలుగుదేశం అడుగులు వేయడం మొదలుపెట్టింది.

తన రాజకీయ ప్రత్యర్థులకు కేసీఆర్‌ సహకరిస్తున్నారనీ, బీజేపీ పెద్దలను సంతృప్తిపర్చడానికై తనను రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారనీ చంద్రబాబు అనుమానిస్తున్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికై చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారనీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆర్థికంగా కూడా సహకరించడానికి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తంచేశారనీ కేసీఆర్‌ భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టడం అన్నది మహాకూటమి ఏర్పాటు

దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ వ్యతిరేకత ప్రాతిపదికన ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో చేయి కలపబోతున్నది. మారిన కాలానుగుణ రాజకీయాల్లో ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిస్తే సెటిలర్ల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడతాయన్న భావనలో కాంగ్రెస్‌తో పాటు టిడిపి కూడా ఉంది. కాంగ్రెస్‌తో చేయి కలపడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించగలమన్న ధీమాలో తెలంగాణ టిడిపి నేతలు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల ప్రకారం మహా కూటమి ఏర్పడినా కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మహాకూటమిలో భాగమై కేసీఆర్‌ను ఓడించగలిగితే, ఆ తర్వాత ఏపీలో జరిగే ఎన్నికలలో చంద్రబాబుకు ప్రయోజనం ఉంటుంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని ఓడించాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు కూడా బలం పెరుగుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండవసారి జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అన్ని కోణాల నుంచీ అంచనా వేసుకున్న విూదటే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించలేని పరిస్థితి ఉంది.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం పుంజుకోకపోగా, గత ఎన్నికలతో పోల్చితే మరింత బలహీనపడింది.తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దాదాపు అయిదు శాతం ఓటుబ్యాంకు ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఈ ఓటు శాతం లభించదు.

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున 15 మంది గెలిచినా ఒకరో ఇద్దరో మాత్రమే మిగిలారు. మిగతా వారంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ మనుగడ కోసం కాంగ్రస్‌తో పొత్తుకు తహతహలాడుతున్నారన్న ప్రచారం ఉంది.