కాంగ్రెస్‌లో చల్లారని టిక్కెట్ల గొడవ

ఢిల్లీ,హైదరాబాద్‌లలో నిరసనలు

జనగామ నుంచే పోటీ అన్న పొన్నాల

రెబల్స్‌గా బరిలోకి దిగిన కొంతమంది

కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారన్న గజ్జెల కాంతం

బిసిలను పాలెగాళ్లుగా చూస్తున్నారన్న చెరకు సుధాకర్‌

తెలంగాణ టిడిపిలోనూ చల్లారని అసమ్మతి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి టికర్కెట్ల పంచాయితీ కాక రాజేస్తూనే ఉంది. రెండోవిడతలో పదిమంది పేర్లు ప్రకటించినా అందులో పేర్లు లేని వారు నానా హంగామా సృష్టించారు. కొందరు రెబల్స్‌గా నామినేషన్‌ వేశారు. టిక్కెట్‌ రాకుంటే అలాగే పోటీలో ఉంటామని అల్టిమేటమ్‌ ఇచ్చారు. ఇకపోతే తాను జనగామ నుంచే పోటీ చేస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. జనగామ నుంచి టీజేఎస్‌ అధినేత కోదండరాం పోటీ చేస్తారనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాల సీట్ల కేటాయింపులపై పూర్తిస్తాయి నిర్ణయం జరగలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రకటించని స్థానాలన్ని మిత్రపక్షాలకు కేటాయిస్తారనుకోవడం పొరపాటేనని చెప్పారు. ఇంకా చాలా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని జనగామ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. అయినా కోదండరామ్‌కు జనగామే ఎందుకు కావాలని కూడా ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పొన్నాల – జనగాం టికెట్‌ ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో పొన్నాల పేరు లేకపోవడంతో ఆయన హుటాహుటిన హస్తినకు వెళ్లారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. జాప్యం జరిగిన మాట వాస్తవమే కానీ జనగామ టికెట్‌ మాత్రం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆశిస్తున్న నియోజకవర్గం లేకపోవడంతో ఆయన సీటు విషయంలో పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. మరోవైపు

జనగామలో పలువురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. పొన్నాలకు టిక్కెట్‌ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు జనగామలో ఆందోళనకు దిగారు. టికెట్‌ ఇవ్వకుండా బీసీ నేతను అవమానిస్తారా అంటూ పొన్నాల అనుచరులు మండిపడుతున్నారు. పొన్నాలకు టికెట్‌ ప్రకటించనందుకు నిరసనగా జనగామలోని 14మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌కు కేటాయించడం పట్ల స్థానిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు దానం నాగేందర్‌ రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్‌ నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్న రోహిణ్‌ రెడ్డిని కాదని దాసోజ్‌ శ్రవణ్‌కు ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ముషిరాబాద్‌లో తనకు ఓటేయండని సోషల్‌ విూడియాలో ప్రచారం చేసుకున్న శ్రవణ్‌కు ఖైరతాబాద్‌ ఎలా ఇస్తారని రోహిణ్‌ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఖైరతాబాద్‌ టికెట్‌ కాంగ్రెస్‌కు ఇవ్వడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్‌ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలంటూ ఎన్టీఆర్‌ భవన్‌ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్‌ టికెట్‌ టీడీపీకి కేటాయించాలంటూ ఓ కార్యకర్త కరెంట్‌ పోల్‌ ఎక్కి నిరసన తెలిపారు. ఇకపోతే రాష్ట్ర కాంగ్రెస్‌ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్‌ క్యామ మల్లేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టికెట్లను అమ్ముకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గొల్ల కురుమ సామాజిక వర్గానికి చెందిన తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల,కురుమలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు. మరోవైపు టిక్కెట్లు రాకపోవడంతో ఉద్యకారులు మండిపడుతున్నారు. గజ్జెల కాంతం, చెరనకు సుధాకర, అద్దంకి దయాకర్‌ వంటి వారిని విస్మరించడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమే లక్ష్యంగా ముగ్గురు బడా నేతలు కోవర్టులుగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గ్జజెల కాంతం ఆరోపించారు. మంచి వారిగా నటిస్టూ.. పార్టీలోని అంతర్గత విషయాల్ని టీఆర్‌ఎస్‌కు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అందుకే, 20 మంది డవ్మిూలను కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ప్రకటించిందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సమావేశమై.. ఎక్కడ డవ్మిూ అభ్యర్థులను పెట్టాలో ఈ కోవర్టులు ఒప్పందం చేసుకున్నారని ఆయన విూడియాకు బుధవారం వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీ భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే కరీంనగర్‌లోనూ మరో ఇద్దరు కాంగ్రెస్‌ కోవర్టులున్నారని కాంతం అన్నారు. కేటీఆర్‌ చెప్పిన వారికే టికెట్లు వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు రాకుండా.. ఈ కోవర్టులంతా కలిసి హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో మాత్రం ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించారని అన్నారు. గురువారం విద్యార్థి నాయకులం, ఉద్యమకారులం భేటీ అవుతాం. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో జరిగిన అవకతవకలను బయటపెడతాం అని గజ్జెల కాంతం హెచ్చరించారు. వాస్తవాలను రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. ఇకపోతే కూటమి మిత్రపక్షమైన టిడిపిలోనూ అసమ్మతి రాజుకుంటోంది. ఖైరతాబాద్‌ టిక్కెట్‌ కాంగ్రెస్‌కు ఇవ్వడంపై టీటీడీపీలో నిరసనలు భగ్గుమన్నాయి. ఓ కార్యకర్త టవరెక్కి నిరసన తెలిపాడు. టీటీడీపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ఓ వైపు శేరిలింగంపల్లి టిక్కెట్‌పై రగడ కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఖైరతాబాద్‌పై లొల్లి మొదలైంది. ఖైరతాబాద్‌ టిక్కెట్‌ కాంగ్రెస్‌కు

కేటాయించినందుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఓ కార్యకర్త ఏకంగా సెల్‌ టవరెక్కాడు. స్థానికులు, పోలీసులు టవర్‌ వద్దకు చేరుకుని అతనిని నచ్చచెప్పి కిందికి దించారు. వెంటనే అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో అసంతృప్తులు బయటపడితే… ఇప్పుడవి టీటీడీపీకి పాకాయి. మరోవైపు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పార్టీకి జనసమితి డెడ్‌లైన్‌ విధించింది. మిర్యాలగూడ, జనగామ సీట్ల కేటాయింపుపై తేల్చాలని అల్టిమేటం విధించింది. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపానికి చెరుకు సుధాకర్‌, చంద్రకుమార్‌లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుకు మాట్లాడుతూ.. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందన్నారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారన్నారు. కూటమి సీట్ల పంపకాల్లో సామాజిక న్యాయమే లేదని దుయ్యబట్టారు.