కాంగ్రెస్‌లో రగులుతున్న యువబ్రిగేడ్‌ 

జాతీయ యవనికపై ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తన శోభను కోల్పోతున్నది. అనూహ్యంగా 2014లో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ తన పంథాను మార్చుకోకపోవడంతోనే 2019లో ఘోర పరాజయాన్ని పొందిందన్నది వాస్తవం. గతంలో అన్ని రోడ్లూ రోమ్‌కే దారి తీస్తాయన్నట్టుగా ప్రతివారూ కాంగ్రెస్‌ దిక్కుకే చూసేవారు, వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. కాంగ్రెస్‌లో ఉన్నవారే బయిటకు చూసే పరిస్థితి ఏర్పడింది.
అందులోనూ పార్టీకి యువనాయకత్వం ఉన్నప్పటికీ, అందులో ఉన్న యువతరం మాత్రం బయటకే చూడడం శోచనీయమే. తమ నలభయ్యవ పడిలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌, మిలింద్‌ దేవరా, జితిన్‌ ప్రసాద, దీపేందర్‌ హుడా అందరూ కూడా యువనాయకత్వ బ్రాండు నుంచి బయిటపడేందుకు పోరాటం చేస్తున్నారు. కానీ, పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్‌ గాంధీ మాత్రం అటువంటి ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే యువ బ్రిగేడ్‌ కొంపముంచుతోంది.
అలలా ఎగిసి అమాంతం పడిపోయిన రాహుల్‌ గాంధీ పరిస్థితి అతడి చుట్టూ ఉన్న ఈ యువత కొంపలు ముంచుతోంది. ఇప్పుడు ఉనికి కోసం వారంతా వంటరి పోరాటం చేసుకునే పరిస్థితి. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, సీనియర్‌ నాయకుడు దిగ్విజయ సింగ్‌పై సింధియా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రాష్ట్రంలో తన ఉనికిని చాటుకుని, కొంత అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం అతడు ఆమోదిత మార్గాలలో ప్రయత్నాలు చేశాడు.
కాంగ్రెస్‌లో యువరక్తం అంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సింధియానేననే భావన కలిగేలా ప్రచారం జరిగింది. ప్రకటనలు, హోర్డింగ్‌లు హోరెత్తాయి. కనీసం రాష్ట్ర పార్టీ అధిపతి అయినా అవుతాడని భావించిన అతడి వర్గీయులంతా భంగపడ్డారు. ఈ క్రమంలోనే సింధియా అనుచరులు దిగ్విజయ్‌ సింగ్‌ను బ్లాక్‌మెయిలర్‌ అని, అక్రమ ఇసుక, మద్య వ్యాపారాలు చేసే వ్యక్తంటూ ఆరోపణలు చేశారు.
అనంతరం దిగ్విజయ్‌కు వ్యతిరేకంగా సోనియా గాంధీకి లేఖలు వెళ్ళాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి ఆయనే నడిపిస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండాపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన గుణ నుంచి ఓడిపోవడంతో అతడు నిమిత్తమాత్రుడిగా మిగిలిపోతున్నాడు.
రాష్ట్ర పార్టీ అధిపతి బాధ్యతలు చేపట్టాలని ముచ్చటపడుతున్న సింధియాకు పార్టీ మాత్రం బిస్కెట్లతో సరిపెడుతున్నది. మొదటగా అతడిని పశ్చిమ యుపి వ్యవహారాల ఇన్‌ఛార్జీగా చేశారు. అదే సమయంలో ప్రియాంక తూర్పు యుపి ఇన్‌ఛార్జిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ అధిపతిగా రాహుల్‌ గాంధీ రాజీనామా చేసినప్పుడు, తనకు అంటగట్టిన బాధ్యతను వదిలించుకున్నారు.
తర్వాత అతడిని త్వరలో ఎన్నికలు జరుగునున్న మహారాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీకి అధిపతిగా నియమించింది. అది కూడా అతను కోరుకున్నది కాదు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ఓటమి పాలైన సింధియా, మిలింద్‌ దేవరా బిజెపిలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కాంగ్రెస్‌లో జరుగుతున్నది.
దానిలో ఉన్న వాస్తవమేదైనా కానీ, ప్రస్తుతం ఇద్దరూ కూడా తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా, తిరిగి సోనియా గాంధీ, ఆమె భజనపరులు పార్టీపై పట్టు సాధించిన తర్వాత యువ బ్రిగేడ్‌కు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపించడం సహజమే.
ఈ పరిస్థితుల కారణంగానే అటు సింధియా, ఇటు దేవరా కూడా పదే పదే పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. యువ నాయకులంతా కూడా బహిరంగంగానే ఆర్టికల్‌ 370 రద్దును ఆహ్వానించారు. ఇటీవలే మోడీ ప్రతిపాదించిన జనాభా నియంత్రణను జితిన్‌ ప్రసాద ఆహ్వానించారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్రసాద బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే పుకార్లు ఎన్నికల సమయంలో షికారు చేశాయి. అయితే, రాహుల్‌ గాంధీ ఆయన మనసు మార్చినట్టు తెలుస్తోంది.
కానీ, రాహుల్‌ గాంధీ పార్టీ పదవి నుంచి తప్పుకోవడంతో అతడు మళ్ళీ బిజెపితో బేరసారాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక పైలట్‌ విషయానికి వస్తే, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవిపై తనకున్న ఆశలను బహిరంగంగానే వ్యక్తం చేసిన అతడు ప్రస్తుతం అత్యంత మౌనాన్ని పాటిస్తున్నాడు. అయితే, రాష్ట్రంలో వసుంధరారాజే, గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ వంటి హేమాహేమీలు ఉన్న తరుణంలో బిజెపిలోకి వెళ్ళినా తనకు ఒరిగేదేమీ లేదని అతడు గుర్తించాడని సన్నిహితులు చెప్తున్నారు. కాగా, తన స్వంత పార్టీని ప్రారంభించేందుకు చాపకింద నీరులా పని చేస్తున్నాడని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి అతడు అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పార్టీలో ఎదుగుదలకు అవకాశం లేకపోవడం, సైద్ధాంతిక సమస్యలు యువ బ్రిగేడ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సరైన నాయకత్వం, కేడర్‌ లేకపోవడంతో కనీసం క్షేత్ర స్థాయిలో నిరసన కూడా తెలుపలేని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు.
పార్టీలో సీనియర్‌ స్థానాలలో ఉన్న నాయకుల పిల్లలకు పెద్దగా సమస్యలు లేకపోవడం కూడా యువ నాయకులను ఇరుకున పెడుతున్నది. కాంగ్రెస్‌లో ఎదగాలంటే, వెనుక పెద్ద దన్ను అవసరమని వారంటున్నారు.
ఏమైనప్పటికీ, ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు పార్టీ మౌలిక కేడర్‌ను దెబ్బతీశాయి. ఇక నాయకులు కూడా అదే బాటపడితే, కాంగ్రెస్‌ ఎప్పటికైనా తన వైభవాన్ని తిరిగి పొందగలదా? దీనికి సమాధానం మాత్రం సమీప భవిష్యత్తులో దొరికేలా కనిపించడం లేదు.