కాంగ్రెస్‌ కూటమితో కష్టాలు తప్పవు

ప్రచారంలో హెచ్చరించిన మంత్రి ఇంద్రకరణ్‌
నిర్మల్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. కూటమితో కష్టాలు కొనితెచ్చుకోవద్దని అన్నారు. తెచ్చుకున్న తెలంగానను ఆగం చేయడానికే వారంతా ఒక్కటయ్యారని అన్నారు. పేదల పక్షాన నిలుస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మామడ మండలంలోని కప్పనపల్లి, చందారం గ్రామాల్లో నేడు పార్టీ శ్రేణులతో కలిసి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు. గడపగడపకూ వెళ్లిన మంత్రి అల్లోలకు అపూర్వ స్పందన లభించింది. గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో మంత్రి మాట్లాడుతూ కారుగుర్తుకు ఓట్లు వేసి తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించి రుణం తీర్చుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఆశీర్వదించి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజాకూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్‌, టీడీపీలు జత కట్టి, ప్రజలకు లేనిపోని హావిూలను ఇస్తూ మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. ఈ కూటమికి ఓటేస్తే ప్రాజెక్టులు, పథకాలు ఎక్కడికక్కడే
నిలిచిపోతాయన్నారు. గతంలో ప్రాజెక్టులను టీడీపీ చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. తెలంగాణలో పెత్తనం చెలాయించడానికే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీహరి రావు, డా.మల్లికార్జున రెడ్డి, రాంకిషన్‌ రెడ్డి, ఏనుగు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.