కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు..  ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదు


– ముప్పైఏళ్లుగా మూసీ గరళాన్ని బలవంతంగా తాగించారు
– మళ్లీ అధికారం తెరాసదే
– ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదని, నాలుగేళ్లుగా అభివృద్ధికి అడ్డుపడుతున్న వీరిని ప్రజలు తిరిమేందుకు సిద్ధంగా ఉన్నారని ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్‌ హాల్‌ లో రూ.75 కోట్ల నిధులతో 25 కులసంఘాలకు భవనాలు మంజూరు చేసినందుకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ హజరయ్యారు.
అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని విమర్శించారు. 30 సంవత్సరాలుగా మూసి గరళాన్ని బలవంతంగా తాగించిన ఘనత గత పాలకులదేనన్నారు. తెరాస అధికారంలోకి రాగానే జిల్లా వాసులకు సురక్షితమైన తాగునీరుఅ ందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 2014 కంటే ముందు సూర్యాపేటలో శాంతి భద్రత సమస్యలతో పాటు, ప్రజల భూముల ఆక్రమణకు గురైతే పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. 2014 తరువాత సూర్యాపేట నియోజవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, వ్యాపారులకు వేధింపులు కూడా లేవని తెలిపారు. మిగిలిన వృత్తి సంఘాలకు కూడా త్వరలోనే సొంత భవనాలు ఏర్పాటు చేయిస్తానని  హావిూ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ అధికారం తెరాసదేనని, సీఎం కేసీఆర్‌ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. నాలుగేళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి, రైతుల ఆర్థికాభివద్ధికి ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా జీవనం సాగించారని అన్నారు. ఇలాంటి పథకాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని మంత్రి తెలిపారు. ఓట్లతో అభివృద్ధిని ముడిపెట్టే అలవాటు తమకు లేదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.