కాంగ్రెస్‌ పోరాటం..  ప్రతిపక్షం కోసమే


– టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు
– కారుగుర్తుకు ఓటేస్తేనే సంక్షేమం
– ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు
మెదక్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో ఎక్కడా చూసిన టీఆర్‌ఎస్‌ గెలుపుపైనే చర్చ జరుగుతోందని,  తమకు పోటీనివ్వని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష ¬దా కోసమే పోరాటం చేస్తుందని ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డి తరపున హరీశ్‌రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని, కారు గుర్తుకు ఓటేస్తే సంక్షేమం వస్తుందన్నారు. టికెట్లు ఇచ్చుకునే సామర్థ్యం లేనోళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారా అని ప్రశ్నించారు. కోదండరాం, పొన్నాల లక్ష్మయ్య టికెట్‌ల కోసం కొట్లాడుకుంటున్నారు అని తెలిపారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 15ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి నర్సాపూర్‌ను అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని తాము చూపిస్తాంమని, ఆమె హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకున్నారన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు, కళ్యాణలక్ష్మి రద్దు చేస్తామని అంటున్నారని, దీని గురించి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో గిరిజన తండాలకు రోడ్లు వేసింది టీఆర్‌ఎస్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. మదన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.